Japan: జపాన్‌ భూకంపంలో 242 మంది ఆచూకీ గల్లంతు..!

జపాన్‌లో సంభవించిన భూకంపంలో దాదాపు 200 మందికిపైగా ఆచూకీ ఇప్పటికీ తెలియడంలేదు. దీంతో అక్కడి సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ బృందాలు వారి కోసం గాలింపు చర్యలను తీవ్రతరం చేశాయి.     

Updated : 05 Jan 2024 17:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భూకంపంలో ఆచూకీ గల్లంతైన 242 మందిని కాపాడేందుకు జపాన్‌ (Japan) ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. భూకంపం తర్వాత బాధితులను కాపాడేందుకు కీలకమైన 72 గంటల సమయం గురువారం సాయంత్రంతో ముగిసిపోయింది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 92కు చేరింది. గల్లంతైన వారిని కాపాడేందుకు సహాయక బృందాల సంఖ్యను ప్రభుత్వం రెట్టింపు చేసింది. 4,600 మంది ప్రస్తుతం గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు.

హిందూ మహా సముద్రంలో మరో నౌక హైజాక్‌.. అందులో 15 మంది భారతీయులు..!

సుజు, వాజిమా నగరాల్లో చాలా మంది బాధితులు ఇళ్ల శిథిలాల కిందే చిక్కుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. వేల కుటుంబాలకు ఇప్పటికీ నీరు, విద్యుత్తు అందటంలేదు. ఈ నగరాలకు వెళ్లే రోడ్లు దెబ్బతినడంతో చాలా మంది నిస్సహాయులుగా ఉండిపోతున్నారు. ఇక్కడ శిథిలాల కింద చిక్కుకుపోయిన ఇద్దరు వృద్ధులను 72 గంటల తర్వాత గురువారం వెలికి తీశారు. శుక్రవారం ఈ విపత్తుపై అధికారులతో కీలక సమావేశం సందర్భంగా ప్రధాని కిషిదా మాట్లాడుతూ.. ‘‘చివరి వరకు ప్రయత్నాలు కొనసాగించాలి’’ అని సూచించారు. బాధితులను చేరుకోవడంలో ఎలాంటి అవకాశాలను వదిలేయవద్దని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

చిక్కుకుపోయిన ప్రజలు..

వాజిమా నగరంలోని సెన్మడియా పాకెట్‌ పార్క్‌లో దాదాపు 60 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వీరిలో విదేశీయులు కూడా ఉన్నారు. ఇక్కడ ఆహారం కొరత తీవ్రంగా ఉంది. సుజు నగరంలో రూట్‌ - 52 మార్గంలో మొత్తం చెట్లు కూలిపోయి ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. శుక్రవారం జపాన్‌ సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ సిబ్బంది ఇక్కడి ఆర్టోమచి అనే ప్రాంతాన్ని చేరుకున్నారు. అక్కడ రెండు షెల్టర్లలో 150 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరికి సహాయ సామగ్రి ఇంకా చేరలేదు. సుజు ప్రాంతంలో చాలా ఇళ్లు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని