Benjamin Netanyahu: ఆకలి కేకలు మా యుద్ధతంత్రం కాదు: నెతన్యాహు

తనపై అరెస్టు వారెంట్ ఇవ్వాలని ఐసీసీలో దాఖలైన పిటిషన్‌పై నెతన్యాహు (Benjamin Netanyahu) తీవ్రంగా స్పందించారు. 

Published : 22 May 2024 18:06 IST

టెల్‌అవీవ్‌: యుద్ధ నేరాల కింద ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu)కు అరెస్టు వారెంట్‌ ఇవ్వాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం(ICC)లో ప్రధాన ప్రాసిక్యూటర్ అభ్యర్థన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మండిపడ్డారు. ‘అబద్ధాల మూట’ ఆధారంగానే తనపై ఆ వారెంట్‌ కోరుతున్నారని అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ దుయ్యబట్టారు. అలాగే ఆ ప్రధాన ప్రాసిక్యూటర్ కరీంఖాన్‌ను తీవ్రంగా విమర్శించారు. గాజాలో ఆకలి కేకల్ని ఇజ్రాయెల్‌ యుద్ధతంత్రంగా వాడుతుందోన్న విమర్శలను ఖండించారు.

ఆకలి మంటల్ని ఇజ్రాయెల్ యుద్ధతంత్రంగా వాడుతున్నట్లు అనిపిస్తోందని గతంలో ఐరాస ఆందోళన వ్యక్తంచేసింది. అదే గనుక నిజమైతే యుద్ధ నేరం కింద పరిగణించాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ ఆరోపణల్ని విశ్వసించేందుకు సహేతుక ఆధారాలున్నాయని ఐసీసీ న్యాయవాదుల బృందం తాజాగా వెల్లడించింది. దాని ఆధారంగానే నెతన్యాహుపై వారెంట్ ఇవ్వాలని కోరింది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌ పౌరులపై పాల్పడిన నేరాలకు గానూ హమాస్‌ నేతలు యహ్యా సిన్వర్‌, మహమ్మద్‌ డెయిఫ్‌, ఇస్మాయిల్‌ హనియాపై అరెస్టు వారెంట్లు జారీ చేయాలని అభ్యర్థించింది. వీరి దాడులతో ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయని, ఎంతోమంది తమ ప్రియమైన వారిని కోల్పోయారన్నారు. ప్రాసిక్యూటర్‌ అప్లికేషన్‌పై ఐసీసీ విచారణ జరపనుంది. అయితే నెతన్యాహును హమాస్‌ నేతల్ని ఒకే గాటిన కట్టడంపై ఇజ్రాయెల్‌ నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. వారెంట్ అభ్యర్థనను అమెరికా కూడా ఖండించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని