Israel: నెతన్యాహు తీరు ఇజ్రాయెల్‌నే గాయపరుస్తోంది: బైడెన్‌

Israel: గాజాలో ఇజ్రాయెల్‌ అనుసరిస్తున్న తీరుపై అమెరికా గతకొంత కాలంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పౌరుల మరణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజాగా అధ్యక్షుడు బైడెన్ మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated : 10 Mar 2024 11:11 IST

విల్మింగ్టన్‌: హమాస్‌పై పోరు విషయంలో ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) అనుసరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంజమిన్‌ వైఖరి ఆయన సొంత దేశాన్నే గాయపరుస్తోందని శనివారం వ్యాఖ్యానించారు. గాజాలో పౌరుల మరణాల విషయంలో ఇజ్రాయెల్‌ (Israel) నిబంధనలకు కట్టుబడటం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇది చాలా పెద్ద పొరపాటని పేర్కొన్నారు.

దాదాపు 1.3 మిలియన్ల మంది పాలస్తీనీయులు ఆశ్రయం పొందుతున్న రఫా ప్రాంతాన్నీ ఇజ్రాయెల్ ఆక్రమించే అవకాశం ఉందన్న వార్తలపై బైడెన్‌ (Joe Biden) కీలక వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహు అనుసరిస్తున్న కఠిన వైఖరికి దాన్ని హద్దుగా భావిస్తున్నామని తెలిపారు. అది మీరితే చర్యలు ఉంటాయని పరోక్షంగా సంకేతాలిచ్చారు. అయితే.. ఇజ్రాయెల్‌ ఎంత హద్దు మీరినా ఆ దేశానికి అమెరికా మద్దతు కొనసాగుతుందని చెప్పడం గమనార్హం. ఆ దేశ రక్షణ, అక్కడి పౌరుల భద్రత చాలా కీలకమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కొన్ని రకాల ఆయుధాలను అందించటం, ఐరన్‌ డోమ్‌ వ్యవస్థకు మద్దతివ్వటం వంటి విషయాల్లో రాజీ ఉండదని స్పష్టం చేశారు.

గాజాలో మరో విషాదం

తన అభిప్రాయాన్ని నేరుగా ఇజ్రాయెల్‌ (Israel) వెళ్లి అక్కడి పార్లమెంటుకే తెలియజేయాలనుకుంటున్నానని బైడెన్‌ వెల్లడించారు. అయితే, ఆ పర్యటన ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలియజేయలేదు. రంజాన్‌ మాసం ప్రారంభానికి ముందే ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందని బైడెన్‌ ఆశిస్తున్నారు. కానీ, ఆ దిశగా పెద్దగా పురోగతి కనిపించడం లేదు. ఇరు పక్షాల మధ్య సయోధ్యకు అగ్రరాజ్యం సహా ఈజిప్టు, ఖతర్‌ ప్రయత్నిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని