Solar Eclipse: సూర్యగ్రహణం.. అక్కడి ‘జైళ్లలో లాక్‌డౌన్‌’!

సంపూర్ణ సూర్య గ్రహణం సందర్భంగా ఏప్రిల్‌ 8న.. 20కి పైగా జైళ్లకు తాళం వేయాలని న్యూయార్క్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అక్కడి ఖైదీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Updated : 02 Apr 2024 19:42 IST

న్యూయార్క్‌: ఏప్రిల్‌ 8న సంపూర్ణ సూర్య గ్రహణం (Solar Eclipse) ఏర్పడనుంది. ఉత్తర అమెరికా, కెనడా ప్రాంతాల్లో దీని ప్రభావం అధికంగా ఉండనుంది. దీన్ని చూసేందుకు అమెరికా వాసులు సిద్ధమవుతున్న తరుణంలో న్యూయార్క్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడున్న జైళ్లలో 20కి పైగా కేంద్రాలకు తాళం వేయాలని ప్రకటించింది. దీనిపై ఖైదీల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. సూర్యగ్రహణాన్ని చూడడంతోపాటు ప్రత్యేక ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలని కోరినప్పటికీ అధికారులు అందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. దీంతో జైళ్లను మూసివేయాలన్న అధికారుల నిర్ణయంపై పలువురు ఖైదీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

‘సూర్యగ్రహణం అనేది అత్యంత అరుదుగా సంభవించేది. మతవిశ్వాసాల పరంగానూ ఎంతో ప్రాముఖ్యం కలిగిఉంది. ఈ ఏడాది సంభవించే అతిపెద్ద ఖగోళ ఘటన. 2017లో చివరిసారిగా ఇక్కడ కనిపించింది. మళ్లీ 2044 వరకు అమెరికాలో కనిపించదు’ అని పేర్కొంటూ వివిధ మతాలకు చెందిన ఆరుగురు ఖైదీలు న్యూయార్క్‌లోని ఫెడరల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇలా జైళ్లలో లాక్‌డౌన్‌ విధించడమనేది ఖైదీలు వారి మతవిశ్వాసాలు పాటించకుండా నిరోధించడంతోపాటు, రాజ్యాంగహక్కును ఉల్లంఘించడమే అవుతుందని అందులో పేర్కొన్నారు.

ఈ ‘మైసూరు మహారాజు’కు సొంతిల్లు, కారు లేదట!

ఏప్రిల్‌ 8న ఏర్పడే ఈ సూర్యగ్రహణం మెక్సికో మీదుగా అమెరికా, కెనడాల నుంచి ప్రయాణించనుంది. గ్రహణ ప్రభావం (ప్రాంతాలను బట్టి) ఒకటిన్నర నుంచి మూడున్నర నిమిషాలపాటు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తల అంచనా. కొద్దిసేపు పూర్తిగా చీకటి ఏర్పడే అవకాశం ఉన్నందున జైళ్లలో ఆ రోజు మొత్తం సందర్శకులను అనుమతించమని అధికారులు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం 2గంటల వరకు జైళ్లలో సందర్శకులకు అనుమతిస్తామన్నారు. అయితే, గ్రహణం చూడడంతోపాటు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలని ఖైదీలు కోరగా.. అది పర్వదినం కానందున అనుమతించబోమని అధికారులు స్పష్టంచేశారు. దీంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదిలాఉంటే, భారత్‌లో మాత్రం ఈ గ్రహణం ప్రభావం అంతగా ఉండదని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని