Yaduveer Wadiyar: ఈ ‘మైసూరు మహారాజు’కు సొంతిల్లు, కారు లేదట!

మైసూరు-కొడగు లోక్‌సభ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున నామినేషన్‌ దాఖలు చేసిన యదువీర్‌ కృష్ణదత్త చామరాజ వడయార్‌.. తనకు సొంత ఇల్లు, కారు లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Updated : 02 Apr 2024 12:45 IST

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా పలు రాష్ట్రాల్లో రాజ కుటుంబీకులు కూడా ప్రత్యక్ష బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అదే తరహాలోనే పూర్వపు మైసూరు రాజకుటుంబానికి చెందిన యదువీర్‌ కృష్ణదత్త చామరాజ వడియార్‌ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మైసూరు-కొడగు లోక్‌సభ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల విలువ మొత్తంగా రూ.4.99 కోట్లుగా ప్రకటించారు. అయినప్పటికీ ఆయనకు సొంత ఇల్లు, భూమి, కనీసం కారు కూడా లేదని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనడం గమనార్హం.

మైసూరు-కొడగు లోక్‌సభ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున నామినేషన్‌ దాఖలు చేసిన యదువీర్‌ కృష్ణదత్త.. ఆయన ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మొత్తంగా రూ.4.99కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. భార్య త్రిషిక కుమారీ వడియార్‌కు రూ.1.04కోట్లు, వారి సంతానం పేరిట రూ.3.64కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని చెప్పారు. వీరి ముగ్గురిపై ఎటువంటి స్థిరాస్తులు లేవని పేర్కొన్నారు.

తిహాడ్‌ జైలు నంబరు 2లో కేజ్రీవాల్‌.. డైలీ రొటీన్‌ ఇదే..!

మొత్తం ఆస్తుల్లో రూ.3.39 కోట్ల విలువైన బంగారు, వెండి నగల రూపంలో తన పేరు మీద ఉన్నట్లు యదువీర్‌ పేర్కొన్నారు. భార్యకు రూ.1.02కోట్ల విలువైన ఆభరణాలు, తన సంతానానికి రూ.24.50లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు. వాస్తవంగా ఏప్రిల్‌ 3న యదువీర్‌ నామినేషన్‌ దాఖలు చేయాలని భావించారు. సోమవారం మంచిరోజు కావడంతో నామినేషన్‌ వేసినట్లు సమాచారం. తన తల్లి ప్రమోద దేవీ వడియార్‌, భాజపా స్థానిక ఎమ్మెల్యే శ్రీవత్సతో కలిసి మైసూరులోని ఎన్నికల అధికారికి రెండు సెట్లు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. మరో సెట్‌ను ఏప్రిల్‌ 3న దాఖలు చేయనున్నారు.

ఇదిలా ఉండగా.. మైసూరు రాజ్యాన్ని వడియార్‌ కుటుంబం 1339 నుంచి 1950 వరకు పాలించింది. స్వాతంత్య్రానంతరం మైసూరు రాజు జయచామ రాజేంద్ర వడయార్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్‌ 1974లో రాజు అయ్యారు. ఆయన 1984-1999 కాంగ్రెస్‌ తరఫున మైసూరు ఎంపీగా గెలుపొందారు. 2013లో కన్నుమూశారు. ఆ తర్వాత రెండేళ్లకు యదువీర్‌ మైసూరు రాజుగా పట్టాభిషిక్తులయ్యారు. ఆయన మైసూరు 27వ రాజు. మసాచుసెట్స్‌ యూనివర్సిటీలో ఆంగ్ల సాహిత్యం, ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశారు. 2016లో దుంగార్‌పుర్‌ యువరాణి త్రిషికను వివాహమాడారు. మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత వడియార్‌ వారసుడు ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని