Nikki Haley: నా ఓటు ఆయనకే..: నిక్కీ హేలీ

Nikki Haley: అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ట్రంప్‌నకు గట్టి పోటీనిచ్చిన నిక్కీ హేలీ ఎట్టకేలకు పెదవి విప్పారు. రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయనున్నారో ప్రకటించారు.

Updated : 23 May 2024 11:21 IST

Trump | కొలంబియా: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్‌ పార్టీ తరఫున డొనాల్డ్‌ ట్రంప్‌నకు గట్టి పోటీనిచ్చిన నిక్కీ హేలీ (Nikki Haley) ఎట్టకేలకు ఆయనకు మద్దతు పలికారు. రాబోయే ఎన్నికల్లో తాను ఆయనకే ఓటేస్తానని ప్రకటించారు. ‘హడ్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వాషింగ్టన్‌’లో బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలగిన అనంతరం నిక్కీ హేలీ ట్రంప్‌నకు (Trump) బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ విషయంలో ఇప్పటి వరకు ఆమె మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఆమె మద్దతుదారులంతా క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడే ప్రమాదం ఉందని రిపబ్లికన్‌ వర్గాలు అనుమానిస్తూ వచ్చాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ రిపబ్లికన్‌ పార్టీ ఏకతాటిపై ఉందన్న సందేశాన్ని హేలీ పంపారు.

అభ్యర్థిత్వ రేసులో ఉన్న సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరి ఓట్లను ట్రంప్‌ (Donald Trump) తనవైపు తిప్పుకోవాల్సిన అవసరం ఉందని హేలీ అన్నారు. వారి మద్దతు కూడగట్టడం కోసం ఆయన శ్రమించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. గుడ్డిగా వారంతా తన వెనకాలే ఉంటారని ట్రంప్‌ అనుకోవడం పొరపాటే అవుతుందన్నారు.

పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నాం

దాదాపు రెండు నెలల క్రితం అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలగుతున్నట్లు నిక్కీ హేలీ (Nikki Haley) ప్రకటించారు. ట్రంప్‌నకు చివరి వరకు గట్టి పోటీనిచ్చారు. ప్రైమరీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరువురూ వ్యక్తిగత స్థాయిలో విమర్శలకు దిగారు. దీంతో ఆమె ట్రంప్‌ వైపు నిలబడకపోవచ్చనే అనుమానాలు తలెత్తాయి. ఎన్నికల సమయంలో రిపబ్లికన్‌ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోతుందని అంతా ఊహించారు. మరోవైపు హేలీ మద్దతుదారులను తమ వైపు తిప్పుకోవటం కోసం బైడెన్‌ బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. వారి కోసం ప్రత్యేకంగా ఓ ప్రచార కమిటీనే ఏర్పాటు చేయడం గమనార్హం.

హేలీ మాత్రం బైడెన్‌ (Joe Biden) విధానాలపై బుధవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా-మెక్సికో సరిహద్దు వివాదాన్ని ఉదహరిస్తూ విదేశాంగ విధానాన్ని తప్పుబట్టారు. తన ప్రచారానికి విరాళాలిచ్చిన వారి కోసం ఇటీవల ఆమె దక్షిణ కరోలినాలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తదుపరి రాజకీయ కార్యాచరణను మాత్రం ప్రకటించలేదు. భవిష్యత్తులో మళ్లీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోరాడితే ప్రైమరీల్లో ట్రంప్‌ అనుచరుల మద్దతు కూడగట్టడం అనివార్యం.

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా కెంటకీ, ఓరెగన్‌ ప్రైమరీల్లో విజయం సాధించారు. ఆయా పార్టీల తరఫున వీరి అభ్యర్థిత్వాలు ఇప్పటికే ఖరారయ్యాయి. నిక్కీ హేలీకి ఇప్పటికీ పార్టీ ప్రైమరీలలో ఓట్లు పడుతున్నాయి. పోటీ నుంచి వైదొలగిన ఆమెకు రిపబ్లికన్‌ ప్రైమరీలో 6 శాతం ఓట్లు లభించడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు