Pakistan: Pakistan: భారత్‌తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్‌!

భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్‌.. తాజాగా మాట మార్చింది.

Published : 29 Mar 2024 00:17 IST

ఇస్లామాబాద్‌: భారత్‌తో వాణిజ్య సంబంధాలపై పాకిస్థాన్‌ (Pakistan) మాట మార్చింది. వీటి పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన దాయాది దేశం.. తమ విధానంలో ఎటువంటి మార్పు లేదని తాజాగా ప్రకటించింది. దానిని పునరుద్ధరించే ప్రణాళిక లేదని పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలకు బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే.

‘2019లో జమ్మూ కశ్మీర్‌పై భారత్‌ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ విషయంలో పాకిస్థాన్‌ వైఖరిలో ఎటువంటి మార్పు లేదు’ అని పాకిస్థాన్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ముంతాజ్‌ జహ్రా బలోచ్‌ పేర్కొన్నారు. పొరుగు దేశాలతో సంబంధాల పునరుద్ధరణపై అడిగిన ప్రశ్నకు ఇలా స్పందించారు.

భారత్‌ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్‌ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!

భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని పాకిస్థాన్‌ నూతన విదేశాంగ మంత్రి ఇస్సాక్‌ దార్‌ ఇటీవల పేర్కొన్నారు. లండన్‌ పర్యటనలో భాగంగా మార్చి 23న స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. పొరుగు దేశాల పట్ల తమ వైఖరిలో మార్పు ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. తమ దేశ వ్యాపారవేత్తలు భారత్‌తో వ్యాపారాన్ని మళ్లీ కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇలా పేర్కొన్న కొన్ని రోజులకే.. అటువంటిది ఏమీ లేదంటూ పాక్‌ విదేశాంగ కార్యాలయం క్లారిటీ ఇవ్వడం గమనార్హం.

కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత భారత్‌తో వాణిజ్య సంబంధాలను పాక్‌ రద్దు చేసింది. భారత్‌ తన చర్యను ఉపసంహరించుకుంటేనే చర్చలు మొదలుపెడతామని షరతులు విధించింది. దీనికి భారత్‌ ఏమాత్రం తలొగ్గలేదు. ఇటీవల పాకిస్థాన్‌ రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన షెహబాజ్‌ షరీఫ్‌ కూడా కశ్మీర్‌పై తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని