Zelensky: యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేం: జెలెన్‌స్కీ

రష్యాతో యుద్ధంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉక్రెయిన్‌పై తప్పక ప్రభావం చూపుతాయని అన్నారు.

Published : 20 Dec 2023 12:27 IST

కీవ్‌: రష్యాతో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని ఉక్రెయిన్‌ (Ukraine) అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) వ్యాఖ్యానించారు. యుద్ధం కోసం ఐదు లక్షల మంది ఉక్రెయిన్‌ పౌరులను సైన్యంలోకి తీసుకోవాలన్న ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిపారు. దీనికి ప్రజా మద్దతు ఉండదని సైన్యంతో చెప్పినట్లు వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు పూర్తి కావొస్తున్న సందర్భంగా మంగళవారం ఆయన విదేశీ మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. 

‘‘రష్యాతో యుద్ధం వచ్చే ఏడాది ముగుస్తుందా? అన్న ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేరు. ఉక్రెయిన్‌ ప్రజలు, సైనిక కమాండర్లు, మాకు మద్దతు తెలుపుతున్న పశ్చిమ దేశాల మిత్రులకు కూడా తెలియదు. అయితే, యుద్ధంలో మా లక్ష్యం నెరవేరే వరకు వెనకడుగు వేయబోం’’ అని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. 

ట్రంప్‌ పోటీలో లేకపోతే..: కొలరాడో తీర్పుపై వివేక్‌ రామస్వామి

మరోవైపు ఉక్రెయిన్‌కు అమెరికా చేస్తున్న సాయంపై స్పందిస్తూ.. వాషింగ్టన్‌పై పూర్తి విశ్వాసం ఉందని, తమకు ద్రోహం చేయదని భావిస్తున్నట్లు జెలెన్‌స్కీ చెప్పారు. వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌కు చేస్తున్న సాయంపై డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉక్రెయిన్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయని జెలెన్‌స్కీ అన్నారు.

కొద్ది రోజుల క్రితం మాస్కో వేదికగా నిర్వహించిన వార్షిక మీడియా సమావేశంలో రష్యా (Russia) అధ్యక్షుడు పుతిన్‌ కీలక విషయాన్ని వెల్లడించారు. రష్యాకు చెందిన దాదాపు 6.17 లక్షల మంది సైనికులు ప్రస్తుతం యుద్ధభూమిలో ఉన్నారన్నారు. వారిలో దాదాపు 2.24 లక్షల మందిని సుశిక్షిత సైనిక బలగాలతో కలిసి పోరాడేందుకు వీలుగా సమీకరించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడి ప్రకటన చర్చనీయాశంమైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని