North Korea: కిమ్‌ శాటిలైట్‌.. శ్వేతసౌధం, పెంటాగన్‌ ఫొటోలు తీసిందట..!

తాము పంపిన నిఘా ఉపగ్రహం అమెరికాలోని కీలక భవనాలు, స్థావరాల ఫొటోలు తీసిందని ఉత్తర కొరియా(North Korea) వెల్లడించింది. అయితే ఈ దేశం చేసిన ప్రకటనపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Published : 28 Nov 2023 14:24 IST

ప్యాంగ్యాంగ్‌: ఈ నెల ఉత్తర కొరియా(North Korea) తొలిసారి తన నిఘా ఉపగ్రహాన్ని(Spy Satellite) భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తాజాగా ఇది శ్వేతసౌధం, పెంటాగన్‌ సహా అమెరికాకు చెందిన నౌకాస్థావరాల చిత్రాలను తీసిందట. వాటిని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌(Kim Jong Un) వీక్షించారట. ఈ విషయాన్ని ఉత్తర కొరియా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తోన్న మీడియా సంస్థ వెల్లడించింది.

గతంలో రెండు సార్లు నిఘా ఉపగ్రహాన్ని(Spy Satellite) భూకక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు కిమ్‌ ప్రభుత్వం విఫలయత్నం చేసింది. ఈసారి రష్యా సహకారంతో ప్రయోగాన్ని విజయవంతం చేసింది. గతవారం ఈ ప్రయోగం జరగ్గా.. కిమ్ లాంచింగ్‌ను వీక్షించారు. అలాగే ఈ ప్రయోగంలో పాలుపంచుకొన్న శాస్త్రవేత్తలు, సిబ్బందికి విందు ఇచ్చారు. అలాగే సోమవారం రాత్రి నిఘా ఉపగ్రహం తీసిన అమెరికా ప్రభుత్వానికి చెందిన రెండు ప్రదేశాలను వీక్షించారని ఆ మీడియా సంస్థ వెల్లడించింది.

నకిలీ ప్రపంచంలో ‘నిజం’ కోసం ఆరాటం

అమెరికా నౌకా స్థావరం, విమాన వాహక నౌకలు, షిప్‌ యార్డ్‌లు, వర్జీనియాలోని ఎయిర్‌ఫీల్డ్ చిత్రాలను ఆ ఉపగ్రహం తీసిందని పేర్కొంది. అలాగే దక్షిణ కొరియాలోని సైనిక స్థావరాల చిత్రాలను తీసిందని తెలిపింది. అయితే ఈ నిఘా ఉపగ్రహం ప్రయోగించిన వారంలోనే సరైన పనితీరును ప్రదర్శిస్తుందని చెప్పడం తొందరపాటే అవుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దానికి అంతరిక్షం నుంచి ఫొటోలు తీసి, పంపే సామర్థ్యం ఉందని ఇప్పుడే చెప్పలేమన్నారు.

ఈ ఉపగ్రహం రూపకల్పనలో రష్యా(Russia) నుంచి ఉత్తరకొరియా(North Korea) సాంకేతిక సహకారం తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రయోగంతో దక్షిణ కొరియా, జపాన్‌, అమెరికా దేశాలు తమ సైన్యాన్ని అప్రమత్తం చేశాయి. అమెరికా, దక్షిణ కొరియా సైనిక కార్యకలాపాలను గమనించడంతోపాటు అణ్వస్త్ర సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకే ఉత్తర కొరియా ఈ రాకెట్‌ ప్రయోగాలు చేస్తోందని ఇదివరకే న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు