North Korea: సియోల్‌ను కవ్వించిన కిమ్‌.. తూర్పు తీరం దిశగా క్రూజ్‌ క్షిపణుల ప్రయోగం

ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఆదివారం ఉదయం తూర్పు తీరం దిశగా క్రూజ్‌ క్షిపణులను ప్రయోగించింది. 

Updated : 28 Jan 2024 10:46 IST

సియోల్‌: ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా  (North Korea) కవ్వింపు చర్యలను కొనసాగిస్తోంది. ఆదివారం ఉదయం మరోసారి తూర్పు తీరం దిశగా పలు క్రూజ్‌ క్షిపణులు ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఇవి తమ దేశంలోని ప్రధాన సైనిక స్థావరం మీదుగా వెళ్లినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనిని యూఎస్‌ నిఘా విభాగం కూడా ధ్రువీకరించింది. నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ఉత్తర కొరియా కదలికలు గమనించేలా తమ రక్షణ విభాగం అమెరికాతో కలిసి పనిచేస్తోందని సియోల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ప్యాంగ్‌యాంగ్‌ ఎన్ని క్షిపణులను ప్రయోగించిందనే సమాచారాన్ని మాత్రం వెల్లడించలేదు. 

వారం రోజుల వ్యవధిలో ఇది రెండో కవ్వింపు చర్య. గతవారం కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) ప్రభుత్వం ‘పుల్వాసల్‌-3-31’ అనే వ్యూహాత్మక క్రూజ్‌ క్షిపణిని పరీక్షించింది. దానికి అణ్వాయుధ సామర్థ్యం ఉందని ప్రకటించింది. తమ సరిహద్దుల్లో అమెరికా, దక్షిణ కొరియా గత వారం ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించడాన్ని ప్యాంగాంగ్‌ ఖండించింది. వాటికి ప్రతి చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు ఆదివారం ఉదయం ఆ దేశ మీడియా సంస్థ కేసీఎన్‌ఏ తెలిపింది. ఈ ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాల్లోకే క్షిపణి ప్రయోగాలు జరిగినట్లు వెల్లడించింది. 

ఆమెకు రూ.692 కోట్లు చెల్లించండి

కొంత కాలంగా అమెరికా సహా దాని మిత్ర దేశాలతో ఉత్తర కొరియా ఘర్షణలకు దిగుతోంది. భవిష్యత్తులో ప్యాంగ్‌యాంగ్‌ మరిన్ని కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పొరుగు దేశాలతో కిమ్ యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు ఎలాంటి సంకేతాలు లేవని అమెరికా, దక్షిణ కొరియా చెబుతున్నాయి. రష్యా సహకారంతోనే ఉత్తర కొరియా క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకుంటోందని ఆరోపించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని