కిమ్‌ ‘చెత్త’ ప్రతీకారం.. దక్షిణ కొరియాపైకి 260 బెలూన్లతో!

దక్షిణ కొరియాలో వందల కొద్దీ బెలూన్లు కలకలం సృష్టించాయి. వీటిని ఉత్తర కొరియా పంపిందట. వాటిల్లో ఏముందో తెలుసా..? పనికిరాని చెత్త..!

Published : 30 May 2024 00:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉభయ కొరియా దేశాల మధ్య నిత్యం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత ఉద్రిక్తతలు ఉంటాయి. అగ్రరాజ్యం అమెరికాతో దక్షిణ కొరియా (South Korea) చేపట్టే సైనిక విన్యాసాలకు స్పందనగా ఉత్తర కొరియా (North Korea) తరచూ క్షిపణి ప్రయోగాలతో కవ్విస్తూనే ఉంటుంది. తాజాగా కిమ్‌ రాజ్యం పొరుగుదేశంపై మరోసారి ప్రతీకార చర్యలకు దిగింది. అయితే క్షిపణులు, బాంబులతోనో కాదండోయ్‌..! ఈసారి ‘చెత్త’ ఐడియాతో వచ్చిన కిమ్‌ (Kim Jong Un).. శత్రు దేశంలో బెలూన్ల ద్వారా చెత్త, విసర్జన పదార్థాలను జారవిడవడం గమనార్హం.

తమ భూభాగంలోకి భారీ బెలూన్లు వస్తున్నట్లు దక్షిణ కొరియా సైన్యం గుర్తించింది. సరిహద్దు ప్రాంతాలతో పాటు సియోల్‌, జియోంగ్సాంగ్‌ ప్రాంతాల్లో రోడ్లపైన ఇవి దర్శనమిచ్చాయి. మొత్తంగా ఇలాంటి 260 భారీ బెలూన్లు ఉత్తర కొరియా నుంచి వచ్చినట్లు సమాచారం. వీటికి ఉన్న బ్యాగుల్లో వాడి పడేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లు, బ్యాటరీలు, పాడైన షూలు, కాగితాలతో కూడిన చెత్త ఉన్నాయి. కొన్ని బెలూన్లలో జంతు విసర్జన కూడా ఉండటం గమనార్హం.

కిమ్‌ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!

దీంతో అప్రమత్తమైన దక్షిణ కొరియా భద్రతా దళాలు.. బాంబు నిర్వీర్య బృందాలు, ఇతర నిపుణులను రంగంలోకి దించింది. చెత్త ఉన్న బెలూన్లను విశ్లేషించడంతోపాటు ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి బృందానికీ తెలియజేశాయి. ఇటువంటి అనుమానాస్పద వస్తువులపై స్థానిక ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వాటిలో ఉన్న వస్తువులు ఇళ్లు, ఎయిర్‌పోర్టులు, రోడ్లకు ప్రమాదమేనని తెలిపింది.

ఉత్తర కొరియా చర్యలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని, తమ ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు కలిగించేవేనని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. వీటివల్ల ఉత్పన్నమయ్యే అన్ని పర్యవసానాలకు కిమ్‌దే బాధ్యత అని పేర్కొంది. ఇలాంటి అమానవీయ, చిల్లర పనులను తక్షణమే ఆపాలని హెచ్చరించింది. తమ సహనాన్ని పరీక్షించాలని ఉత్తర కోరుకుంటోందని.. దీనిపై తమ ప్రతిస్పందన మెల్లగా ఉంటుందని స్పష్టంచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని