UN Report: ఇంట్లోనే మహిళకు ముప్పు.. 10 నిమిషాలకు ఒక హత్య!

Eenadu icon
By International News Team Published : 25 Nov 2025 19:54 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలకు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇల్లే అవుతోంది! కట్టుకున్న భాగస్వామి, సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ హత్యకు గురవుతున్నట్లు ఐక్యరాజ్యసమితి (UN) తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 83,000 మంది మహిళలు, బాలికలు హత్యకు గురయ్యారు. వీరిలో 60 శాతం మంది అంటే సుమారు 50,000 మంది వారి భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల వల్లే ప్రాణాలు కోల్పోయారు. ఈ లెక్కన రోజూ సగటున 137 మంది మహిళలు భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు.

ఐక్యరాజ్యసమితికి చెందిన మాదకద్రవ్యాల నేరాల కార్యాలయం (UNODC), UN మహిళా విభాగం కలిసి ఈ నివేదికను సోమవారం విడుదల చేశాయి. మహిళలు, బాలికల హత్యల నివారణ విషయంలో ఇప్పటికీ చెప్పుకోదగిన పురోగతి ఏమీ కనిపించటం లేదని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. పురుషుల హత్యల విషయంలో భాగస్వాములు, కుటుంబ సభ్యుల పాత్ర 11 శాతంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే మహిళలకు సొంతింటి నుంచే ప్రాణాలకు ముప్పు ఎక్కువ ఉందనే విషయం స్పష్టమవుతోంది.

ఈ దారుణమైన హింస ప్రతి ప్రాంతంలోనూ ఉంది. భాగస్వామి లేక కుటుంబ సభ్యుల వల్ల జరిగిన హత్యల రేటు ఆఫ్రికాలో అత్యధికంగా నమోదైంది. లక్ష మంది మహిళల్లో ముగ్గురికి ఈ ముప్పు ఉంది. ఆ తరువాత స్థానాల్లో అమెరికా (1.5), ఓషియానియా (1.4) ఉన్నాయి. ఆసియా (0.7), యూరప్ (0.5) ప్రాంతాల్లో ఈ రేటు కాస్త తక్కువగా ఉంది.

డిజిటల్ మాధ్యమాల ద్వారా మహిళలపై జరిగే హింస కూడా ఒక పెద్ద ముప్పుగా మారుతోందని నివేదిక పేర్కొంది. ఆన్‌లైన్‌లో మొదలైన హింస తరచూ ఆఫ్‌లైన్‌కు మారి చివరికి మహిళ ప్రాణాలు కోల్పోవటానికి దారి తీస్తుందని UN మహిళా విభాగం పాలసీ డైరెక్టర్ హెండ్రిక్స్ తెలిపారు. ఈ సమస్యను అరికట్టడానికి మెరుగైన నివారణ వ్యూహాలు, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని UNODC తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాన్ బ్రాండోలినో ఉద్ఘాటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని