Canada: రెచ్చిపోతోన్న ఖలిస్థానీ సానుభూతిపరులు.. ఉద్రిక్తతల వేళ మరోసారి రెఫరెండం..!

భారత్‌- కెనడాల మధ్య దౌత్యపరంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ప్రత్యేక ఖలిస్థాన్‌ ఏర్పాటుకు అనుకూలంగా రెండోసారి రెఫరెండం నిర్వహించడం గమనార్హం.

Published : 30 Oct 2023 17:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య తర్వాత భారత్‌- కెనడాల మధ్య దౌత్యపరంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్‌పై కెనడా ప్రధాని ట్రూడో వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం ఇరు దేశాల సంబంధాలు మరింత క్షీణించాయి. దీంతో తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని రెండు దేశాలు అడ్వైజరీలు జారీ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే కెనడాలోని ఖలిస్థానీ సానుభూతిపరులు మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నాలకు దిగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రత్యేక ఖలిస్థాన్‌ ఏర్పాటుకు అనుకూలంగా తాజాగా మరోసారి రెఫరెండం నిర్వహించడం గమనార్హం. ఈ అనధికార ఓటింగ్‌లో వేల సంఖ్యలో ఖలిస్థానీ అనుకూలవాదులు పాల్గొన్నట్లు అంచనా.

ప్రత్యేక ఖలిస్థాన్‌కు మద్దతుగా అమెరికాకు చెందిన ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే)’ ఆధ్వర్యంలో బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రీలో రెఫరెండం నిర్వహించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు గురైన గురుద్వారా దగ్గరే ఈ ఓటింగ్‌ నిర్వహించడం గమనార్హం. అయితే, ఇందులో ఖలిస్థానీ మద్దతుదారులు పాల్గొంటున్నప్పటికీ.. అనేక మంది సిక్కులు దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.

‘ట్రూడో ఓ అసమర్థ ప్రధాని’.. కెనడా విపక్ష నేత ధ్వజం

ఖలిస్థాన్‌ అనుకూల సంస్థ ‘ఎస్‌ఎఫ్‌జే’ వ్యవస్థాపకుల్లో ఒకడైన గురుపత్వంత్‌ సింగ్‌.. ఈ రెఫరెండం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందులో దాదాపు 2 లక్షల మంది పాల్గొన్నట్లు చెబుతున్నప్పటికీ.. ఈ సంఖ్యపై స్పష్టత లేదు. కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరులు గతంలోనూ రెఫరెండం జరిపారు. ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో మరోసారి రెఫరెండం నిర్వహించడం గమనార్హం. ఈ పరిణామాలపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. కెనడా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని