Pak: అవి అణుపరికరాలు కాదు.. సాధారణ యంత్రాలు: నౌక సీజ్‌పై పాక్‌ స్పందన

ముంబయిలో సీజ్‌ చేసిన పరికరాలపై పాక్‌ స్పందించింది. అణుకార్యక్రమాలకు.. ఆ పరికరానికి సంబంధం లేదని పేర్కొంది.  

Published : 03 Mar 2024 15:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా నుంచి తమకు అణుపరికరాలను సరఫరా చేస్తున్న నౌక దొరికిపోవడంపై పాకిస్థాన్‌ (Pakistan) స్పందించింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇది కరాచీకి చెందిన ఓ కంపెనీ దిగుమతి చేసుకొంటున్న లేత్‌ యంత్రానికి సంబంధించిన విషయం. ఆ సంస్థ పాక్‌లోని ఆటోమొబైల్‌ కంపెనీలకు విడిభాగాలను సరఫరా చేస్తుంది. దానిలోని స్పెసిఫికేషన్లను బట్టి పూర్తిగా వాణిజ్య అవసరాలకు మాత్రమే వినియోగిస్తారు. దీనికి సంబంధించిన లావాదేవీలు పూర్తి పారదర్శకంగా బ్యాంకింగ్‌ వ్యవస్థలోనే జరిగాయి. అవసరమైన పత్రాలు ఉన్నాయి. అన్యాయంగా వాటిని సీజ్‌ చేశారు. సంబంధిత ప్రైవేటు సంస్థలు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాయి. అంతర్జాతీయ చట్టాలకు ఇది విరుద్ధం. భారత్‌ బలవంతంగా వాణిజ్య వస్తువులను సీజ్‌ చేయడాన్ని ఖండిస్తున్నాం. అంతర్జాతీయ వాణిజ్యానికి ముప్పుగా మారేలా ఉన్న ఏకపక్ష  పోలీసింగ్‌ ప్రమాదకరం’’ అని పాకిస్థాన్‌ విదేశాంగశాఖ దానిలో పేర్కొంది. 

చైనా నుంచి కరాచీకి వెళ్తున్న సీఎంఏ సీజీఎం అట్టిలా అనే నౌకను ముంబయికి సమీపంలో భారత భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీనిలో అణు కార్యక్రమంతోపాటు బాలిస్టిక్‌ క్షిపణుల తయారీకి సంబంధించిన యంత్రాలు ఉన్నాయని శనివారం అధికారులు వెల్లడించారు. మాల్టా జెండాతో వెళ్తున్న ఈ నౌకను నిఘా విభాగం ఇచ్చిన సమాచారంతో జనవరి 23వ తేదీన ఆపిన కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు చేశారు. అందులో ఇటలీ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్‌ న్యూమరికల్‌ కంట్రోల్‌ (సీఎన్‌సీ) మెషీన్‌ వంటివి ఉన్నాయి. వాటిని డీఆర్‌డీవో అధికారులు పరిశీలించి అణు కార్యక్రమానికి వినియోగించేదిగా తేల్చారు. క్షిపణి అభివృద్ధిలోనూ ఉపయోగించవచ్చు. వాస్సెనార్‌ ఒప్పందం ప్రకారం.. సీఎన్‌సీ మెషీన్‌ అనేది అంతర్జాతీయ ఆయుధాల సరఫరా నియంత్రణ పరిధిలోకి వస్తున్నందున స్వాధీనం చేసుకున్నామని భారత అధికారులు వెల్లడించారు. 

చైనా నౌకలో ఉన్నది కంప్యూటర్‌ న్యూమరికల్‌ కంట్రోల్డ్‌ లేత్‌ మిషిన్‌గా తేల్చారు. రక్షణ, అంతరిక్ష కార్యక్రమాల్లో అత్యంత కచ్చితత్వంతో పనిచేసే పరికరాల తయారీకి దీనిని వాడతారు.  22,180 కిలోల బరువున్న ఈ యంత్రాన్ని ఐరోపా దేశాల నుంచి చైనా దిగుమతి చేసుకొంది. ఉత్తర కొరియా ఇలాంటి యంత్రాన్నే తన అణు కార్యక్రమంలో వినియోగించింది. 

ఇదే తొలిసారి కాదు..

చైనా నుంచి పాకిస్థాన్‌కు తరలించే అణు పరికరాలను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. పౌర-సైనిక అవసరాలకు ఉపయోగించే వాటిని ఎగుమతి చేస్తున్నారు. 2022 మార్చిలో పాకిస్థాన్‌కు చెందిన రక్షణ పరికరాల తయారీ సంస్థ కాస్మోస్‌ ఇంజినీరింగ్‌ ఇటలీ నుంచి థర్మోఎలక్ట్రిక్‌ పరికరాలను తరలిస్తుండగా..పోర్టులోనే అడ్డుకొన్నారు. ఐరోపా నుంచి నిషేధిత పరికరాలను చైనాను అడ్డం పెట్టుకొని దిగుమతి చేసుకొంటోందన్న ఆరోపణలున్నాయి.  

మా అనుమతి లేకుండా ఇంటర్వ్యూ చేస్తారా.. భారత మీడియాపై చైనా రుసరుస

2020లో చైనా నుంచి పాక్‌కు ఇండస్ట్రియల్‌ ఆటోక్లేవ్‌ను తరలిస్తుండగా గుజరాత్‌లో సీజ్‌ చేశారు. దీనిని కూడా అణు, క్షిపణి కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఇండస్ట్రీయల్‌ డ్రయ్యర్‌ పేరిట నాడు దీనిని తరలిస్తున్నట్లు తేల్చారు. దీనిని హాంకాంగ్‌ పతాకం ఉన్న నౌకపై రవాణా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని