China: మా అనుమతి లేకుండా ఇంటర్వ్యూ చేస్తారా.. భారత మీడియాపై చైనా రుసరుస

చైనా మరోసారి భారత్‌ మీడియాపై అక్కసు వెళ్లగక్కింది. తైవాన్‌ తమ దేశంలో అంతర్భాగమని పేర్కొంది.  

Published : 03 Mar 2024 10:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత మీడియా చేసిన ఓ ఇంటర్వ్యూ చైనాకు ఆగ్రహం తెప్పించింది. తమ అనుమతి లేకుండా ఎలా చేస్తారంటూ మండిపడింది. న్యూదిల్లీ మీడియా ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. అసలేం జరిగిందంటే.. 

ఇటీవల భారత్‌కు చెందిన ఓ ఆంగ్ల మీడియా సంస్థ ఫిబ్రవరి చివరల్లో తైవాన్‌ విదేశాంగ మంత్రి జోసఫ్‌ వూ ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. తైవాన్‌కు చెందిన అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ ఘటన చైనా దౌత్య కార్యాలయానికి ఆగ్రహం తెప్పించింది. భారత మీడియా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తోందని.. తైవాన్‌ స్వాతంత్ర్యానికి వేదికను కల్పిస్తోందని ఆరోపించింది. ఇది ‘వన్‌-చైనా ప్రిన్సిపల్‌’కు విరుద్ధమని పేర్కొంది. తాము ఇటువంటి వాటిని ఏమాత్రం అంగీకరించబోమని తెలిపింది. ప్రపంచంలో ఒక్క చైనా మాత్రమే ఉందని.. తైవాన్‌ తమలో  అంతర్భాగమని వెల్లడించింది. పీఆర్‌సీలోని ప్రభుత్వమే మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పింది. 

సీఏఏ అమలుకు సంకేతమా ఇది!

ఈ ఘటనపై తైవాన్‌ విదేశాంగశాఖ ఘాటుగా స్పందించింది. ‘‘భారత్‌, తైవాన్‌లు పీఆర్‌సీలో అంతర్భాగాలు కాదు.. దాని కీలుబొమ్మలం కాదు.  పత్రికాస్వేచ్ఛ ఇరు ప్రజాస్వామ్యాల్లో ఉంది. ఆర్థిక వ్యవస్థ కుంగిపోతుండటంపై బీజింగ్‌ ఆందోళన చెందాలి. అంతేకానీ,  పొరుగు దేశాలను వేధించకూడదు’’ అని పేర్కొంది. 

2020లో తైవాన్‌ నేషనల్‌ డేను ఏ విధంగా కవర్‌ చేయాలో చైనా దౌత్యకార్యాలయం మన మీడియాకు పాఠాలు చెప్పింది. ఈ మేరకు విలేకర్లకు నాడు మెయిల్స్‌ పంపింది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తమ దేశంలో మీడియాకు స్వేచ్ఛ ఉందని.. సరైనది అనుకున్న అంశాలను అది రిపోర్టు చేస్తుందని న్యూదిల్లీ చైనా దౌత్య కార్యాలయానికి సమాధానం ఇచ్చింది. నాడు కూడా తైవాన్‌ విదేశాంగశాఖ భారత్‌ మీడియాకు అండగా నిలిచింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని