Pakistan: ‘న్యూ ఇండియాతో కష్టమే’: భారత్‌పై నోరుపారేసుకున్న పాక్‌

ఐరాస వేదికగా పాకిస్థాన్‌ శాశ్వత ప్రతినిధి మునీర్ అక్రమ్‌.. మన దేశంపై వక్రబుద్ధి చూపించారు. 

Published : 22 May 2024 16:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దాయాది దేశం పాకిస్థాన్‌ (Pakistan) భారత్‌పై అక్కసు వెళ్లగక్కడమే పనిగా పెట్టుకుంది. అంతర్జాతీయ వేదికలపై మన దేశాన్ని ఉద్దేశించి మరోసారి కారుకూతలు కూసింది. నవ భారతంతో గణనీయమైన ముప్పు పొంచి ఉందని నోరు పారేసుకుంది. ఐరాసకు పాక్‌ శాశ్వత ప్రతినిధి మునీర్‌ అక్రమ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనక భారత్‌ హస్తం ఉందంటూ ఆ మధ్య బ్రిటన్‌కు చెందిన ‘ది గార్డియన్’ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిని ఉద్దేశించి మునీర్‌ కొద్దిరోజుల క్రితం ఐరాసలో మాట్లాడారు. ‘‘భారత్‌ చర్యల గురించి పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి భద్రతా మండలి, జనరల్ అసెంబ్లీకి వెల్లడించింది. ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఒక్క పాకిస్థాన్‌కే పరిమితం కాలేదు. కెనడాకు విస్తరించాయి. యూఎస్‌లో ఇలాంటి యత్నాలు జరిగాయి. నవ భారతంతో ముప్పు పొంచిఉంది’’ అంటూ నిరాధార ఆరోపణలు చేశారు. ‘‘నేడు మన దేశంలో బలమైన ప్రభుత్వం ఉంది. ఉగ్రవాదులు తిరిగి తమ సొంత దేశాలకు పారిపోయినా.. అక్కడికి వెళ్లి మరీ వారిని హతమారుస్తాం’’ అంటూ గతంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఐరాసలో ప్రస్తావించారు.

‘మొదటి భార్యపై అత్యాచారం’.. ట్రంప్‌ బయోపిక్‌లో వివాదాస్పద సన్నివేశాలు!

2019 నాటి పుల్వామా ఘటన తర్వాత తనకు ప్రమాదకరంగా మారుతున్న వ్యక్తులను భారత్‌ లక్ష్యంగా చేసుకొందని బ్రిటన్ పత్రిక వెల్లడించిన సంగతి తెలిసిందే. భారత విదేశీ ఇంటెలిజెన్స్‌ సంస్థ ‘రా’ ఇప్పటికే దాదాపు 20 హత్యలు చేసి ఉంటుందని ఆరోపించింది. భారత్‌, పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే కథనం రాసినట్లు పేర్కొంది. అయితే భారత విదేశాంగ శాఖ దీనిని తీవ్రంగా ఖండించింది. అది పూర్తిగా తప్పుడు సమాచారమని, భారత వ్యతిరేక ప్రచారమని పేర్కొంది. ఇతర దేశాల్లో లక్షిత హత్యలకు పాల్పడటం భారత ప్రభుత్వ విధానం కాదని స్పష్టంచేసింది. ఆ తర్వాత ఓ కార్యక్రమంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘భారత్ ఎప్పుడూ ఏ దేశంపై దాడి చేయదు. పొరుగుదేశాలతో సత్సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటుంది. దేశంలో శాంతికి విఘాతం కలిగించేందుకు ఏ ఉగ్రవాది అయినా ప్రయత్నిస్తే.. తగిన సమాధానం చెప్తాం. ఒకవేళ వారు పాకిస్థాన్‌కు పారిపోయినా వదలం’’ అని స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు. మోదీ నుంచి అదే రకమైన స్పందన వచ్చింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని