Trump Biopic: ‘మొదటి భార్యపై అత్యాచారం’.. ట్రంప్‌ బయోపిక్‌లో వివాదాస్పద సన్నివేశాలు!

Trump biopic: ట్రంప్‌ జీవితం ఆధారంగా తీసిన ‘అప్రెంటిస్‌’ అనే సినిమాను ఇటీవల కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. దీనిపై ట్రంప్‌ బృందం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

Updated : 22 May 2024 10:54 IST

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donal Trump) బయోపిక్‌ ప్రీమియర్‌ షో ఇటీవల కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ‘ది అప్రెంటిస్‌’ పేరిట వచ్చిన ఈ చిత్రంపై ఆయన బృందం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని కోర్టులో సవాల్‌ చేస్తామని వెల్లడించాయి.

1970, 1980లలో ట్రంప్‌ (Trump) అమెరికా స్థిరాస్తి వ్యాపారంలో ఎలా ఎదిగారో ఈ సినిమాలో చూపించారు. ఇందులో కొన్ని సన్నివేశాలు కల్పితమని.. మాజీ అధ్యక్షుడి ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని ఆయన ప్రచార బృందం ఆరోపించింది. దీన్ని ఒక చెత్త చిత్రంగా కొట్టిపారేసింది. హాలీవుడ్‌ ప్రముఖుల కుట్రగా అభివర్ణించింది.

చాలా సన్నివేశాలు కల్పితాలు అనే డిస్‌క్లెయిమర్‌తోనే ఈ చిత్రం ప్రారంభమవుతుందని సమీక్షకులు వెల్లడించారు. శృంగార తారకు అక్రమ నిధుల బదిలీ కేసులో ట్రంప్‌ ప్రస్తుతం కోర్టు విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరోవైపు నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన రిపబ్లికన్‌ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. అలాంటి సమయంలో ఈ చిత్రం తెరపైకి రావడం గమనార్హం.

ఎవరయ్యేను ఖమేనీ వారసుడు?

1970, 1980ల్లో ఘటనలు..

అప్రెంటిస్‌ (Trump Biopic The Apprentice) అనే పేరును ట్రంప్‌ దాదాపు దశాబ్దం పాటు నడిపిన టీవీ సిరీస్‌ టైటిల్‌ను తలపించేలా ఎంచుకున్నారు. సినిమాలో మాత్రం ఈ షో ప్రసారం కావడానికి చాలా దశాబ్దాల క్రితం చోటుచేసుకున్న సంఘటనలను చూపించినట్లు సమీక్షకులు తెలిపారు. స్థిరాస్తి వ్యాపారిగా నిలదొక్కుకుంటున్న ఆయన తొలినాళ్ల జీవితాన్ని ఇందులో చూపినట్లు వెల్లడించారు. ప్యామ్‌ అండ్‌ టామీ, డంబ్‌ మనీ సహా పలు ఎంసీయూ చిత్రాల్లో వింటర్‌ సోల్జర్‌గా నటించిన సెబాస్టియన్‌ స్టాన్‌ దీంట్లో ట్రంప్‌ పాత్రను పోషించారు. అలాగే ఆయన మెంటార్‌, ప్రముఖ న్యాయవాది రాయ్‌ కోన్‌ పాత్రలో సక్సెషన్‌ సినిమా స్టార్‌ జెరెమీ స్ట్రాంగ్‌ కనిపించారు.

‘అత్యాచారం, లైంగిక సమస్యలు, బట్టతల, ద్రోహం’ వంటి సన్నివేశాలతో సినిమా (Trump Biopic) ప్రథమార్ధాన్ని ట్రంప్‌పై సానుభూతి కలిగేలా చిత్రీకరించారని చూసినవాళ్లు వెల్లడించారు. క్రమంగా లాయర్‌ రాయ్‌ కోన్‌ పరిచయం తర్వాత ఆయన వ్యక్తిత్వం ఎలా రూపాంతరం చెందిందో చూపించినట్లు తెలిపారు. అధికారం, డీల్ మేకింగ్‌లో మెలకువలు తెలుసుకున్న తర్వాత క్రమంగా కఠినంగా మారారని వివరించారు. ఆయనపై వచ్చిన కొన్ని ఆరోపణలకు దర్శకుడు అలీ అబ్బాసీ కల్పితాలను జత చేసి సినిమాను ఆసక్తికరంగా మార్చినట్లు తెలిపారు. తన మొదటి భార్య ఇవానాను ట్రంప్‌ అత్యాచారం చేసినట్లుగా చూపడం ఇప్పుడు వివాదానికి తెరతీసింది. నిజజీవితంలో విడాకుల ప్రక్రియ కోర్టులో ఉన్న సమయంలో తనపై ఆయన అత్యాచారానికి పాల్పడ్డట్లు ఇవానా ఆరోపించారు. తర్వాత వాటిని వెనక్కి తీసుకున్నారు. 2022లో ఆమె మరణించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పాత్రను మరియా బకలోవా పోషించారు.

ఎన్నికల్లో హాలీవుడ్‌ ప్రముఖుల జోక్యం..

ట్రంప్‌ ప్రచార బృందం డైరెక్టర్‌ స్టీవెన్ చియుంగ్ ఈ సినిమాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసత్యాలను సంచలనం చేసేందుకు తీసిన ఒక చెత్త సినిమా అని కొట్టిపారేశారు. ఇందులో చూపించినవన్నీ కల్పితాలని పేర్కొన్నారు. దీన్ని రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో హాలీవుడ్‌ ప్రముఖుల జోక్యంగా అభివర్ణించారు. ట్రంప్‌ కచ్చితంగా తిరిగి అధికారంలోకి వస్తారనే అక్కసుతోనే ఇలాంటి కుట్రలకు తెరతీస్తున్నారని ఆరోపించారు.

ఆయన ఆశ్చర్యపోతారు..

ఈ ఆరోపణలపై డైరెక్టర్‌ అబ్బాసీ స్పందించారు. సినిమా చూడకుండా కోర్టులో సవాల్‌ చేయడం సరికాదని హితవు పలికారు. ఈ చిత్రాన్ని చూసి ట్రంప్‌ కచ్చితంగా ఆశ్చర్యపోతారని.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయన ఆగ్రహించరని చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు