Pakistan: భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణను పరిశీలిస్తున్నాం: పాక్‌

భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని పాక్‌ తీవ్రంగా పరిశీలిస్తోందని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు.

Published : 24 Mar 2024 14:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణపై తీవ్రంగా ఆలోచిస్తున్నామని పాక్‌ (Pakistan) విదేశాంగ మంత్రి ఇస్సాక్‌ దార్‌ తెలిపారు. శనివారం లండన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘మా దేశ వాణిజ్యవేత్తలు భారత్‌తో వ్యాపారాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది’’ అని పేర్కొన్నారు. భారత్‌తో దౌత్య సంబంధాల విషయంలో మారుతున్న పాకిస్థాన్‌ వైఖరికి ఈ ప్రకటన అద్దంపడుతోంది.

కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత భారత్‌తో వాణిజ్య సంబంధాలను పాక్‌ సస్పెండ్‌ చేసింది. న్యూదిల్లీ తన చర్యలను ఉపసంహరించుకుంటేనే తాము చర్చలు మొదలుపెడతామని షరతులు విధించింది. దీనికి భారత్‌ ఏమాత్రం తలొగ్గలేదు. జమ్మూకశ్మీర్‌ తమ నుంచి విడదీయలేని భాగమని పేర్కొంది. దానికి సంబంధించిన విషయాలు పూర్తిగా అంతర్గతమని స్పష్టం చేసింది.

ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న కొన్ని సానుకూల పరిణామాలతో పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపించింది. 2003 నాటి సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని 2021లో పునరుద్ధరించడం వంటివి సజావుగా సాగాయి. ఇటీవల పాక్‌ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ రెండోసారి ఎన్నికైన వేళ భారత ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. దీనికి షరీఫ్‌ కూడా ధన్యవాదాలు చెప్పారు.

ఉగ్రవాదాన్ని భారత్‌ ఏమాత్రం ఉపేక్షించదని సింగపుర్‌లో మన విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ వ్యాఖ్యానించారు. ‘‘ఎప్పుడో ఒక సారి ఉగ్ర ఘటనలు జరగడం కాదు.. ఎక్కువగా కొనసాగుతున్నాయి. పొరుగు దేశంలో ఉగ్రవాదం పరిశ్రమ స్థాయిలో ఉంది. వీటికి ఎక్కడో ఒక చోట పరిష్కారం కనుగొనాలి. లేకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది. ప్రతి దేశం తమ పొరుగు దేశం స్థిరంగా ఉండాలని కోరుకుంటుంది. అలా సాధ్యంకాని పక్షంలో ఎటువంటి అస్థిరత లేకుండా ఉండాలని భావిస్తుంది’’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాక్‌ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు రావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని