Arms Deal: ఉక్రెయిన్‌కు ఆయుధాలు.. రూ.3 వేల కోట్లు మూటగట్టుకున్న పాకిస్థాన్‌!

ఉక్రెయిన్‌కు మందుగుండు సామగ్రిని సరఫరా చేసేందుకుగానూ కుదుర్చుకున్న ఆయుధ ఒప్పందాల ద్వారా పాకిస్థాన్‌కు 364 మిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరినట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది.

Published : 14 Nov 2023 20:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోన్న వేళ ఉక్రెయిన్‌ (Ukraine)కు రహస్యంగా ఆయుధాలు సరఫరా చేసిందంటూ పాకిస్థాన్‌పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు మందుగుండు సామగ్రిని సరఫరా చేసేందుకుగానూ అమెరికాకు చెందిన రెండు ప్రైవేటు సంస్థలతో కుదుర్చుకున్న ఆయుధ ఒప్పందాల (Arms Deal) ద్వారా పాకిస్థాన్‌ (Pakistan).. రూ.3 వేల కోట్లు (364 మిలియన్‌ డాలర్లు) మూటగట్టుకున్నట్లు ఓ అంతర్జాతీయ వార్తాసంస్థ తాజాగా పేర్కొంది. కీవ్‌కు ఆయుధాలు సరఫరా చేసేందుకుగానూ బ్రిటన్‌ సైనిక కార్గో విమానం.. రావల్పిండిలోని పాకిస్థాన్ వాయుసేన స్థావరం ‘నూర్ ఖాన్’ నుంచి బ్రిటిష్ సైనిక స్థావరాలైన సైప్రస్, అక్రోతిరి, ఆపై రొమేనియాకు మొత్తం ఐదుసార్లు వెళ్లినట్లు పేర్కొంది.

‘అమెరికన్‌ ఫెడరల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ డేటా సిస్టమ్‌’ నుంచి ఈ ఒప్పందాల వివరాలను వార్తాసంస్థ ఉటంకించింది. రష్యాపై ఎదురుదాడులు చేస్తోన్న ఉక్రెయిన్‌కు ఆయుధాలు, ప్రత్యేకంగా 155 ఎంఎం మందుగుండ్లను విక్రయించడానికి గ్లోబల్ మిలిటరీ, నార్త్‌రప్‌ గ్రుమాన్‌ అనే అమెరికా కంపెనీలతో పాకిస్థాన్‌ రెండు ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు పేర్కొంది. 2022 ఆగస్టులో ఈ ఒప్పందాలపై సంతకాలు అయ్యాయని, ఈ ఏడాది అక్టోబరుతో వాటి గడువు ముగిసిందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే 2021-22లో పాకిస్థాన్ ఆయుధ ఎగుమతులు 13 మిలియన్ డాలర్లుగా ఉండగా.. 2022-23 నాటికి ఏకంగా 415 మిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలను ప్రస్తావించింది. అయితే, పాకిస్థాన్‌ మాత్రం ఈ కథనాలను ఖండించింది.

అబ్బే.. ఉక్రెయిన్‌కు మేము ఆయుధాలు అమ్మట్లేదు..: పాకిస్థాన్‌

ఆర్థిక ఇక్కట్లతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్థాన్‌.. ఐఎంఎఫ్‌ ప్యాకేజీ పొందేందుకే ఉక్రెయిన్‌కు ఆయుధాలను రహస్యంగా సరఫరా చేస్తోందని గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. అమెరికా ఒత్తిడితోనే పాకిస్థాన్‌ ఈ సంక్షోభంలో తలదూర్చిందని ‘ఇంటర్‌సెప్ట్‌’ అనే ఇన్వెస్టిగేటివ్‌ వెబ్‌సైట్‌ వెల్లడించింది. అయితే.. ఈ నివేదికలను పాక్‌ విదేశాంగశాఖ కార్యాలయం అప్పట్లో తోసిపుచ్చింది. ఉక్రెయిన్‌, రష్యాల సంక్షోభం విషయంలో తటస్థ వైఖరిని పాటిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జులైలో ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రి కులేబా పాక్‌లో పర్యటించిన సమయంలో కూడా ఇటువంటి ప్రచారమే జరిగింది. కానీ, ఆయన వాటిని ఖండించారు. తమ మధ్య ఆయుధ పంపిణీ ఒప్పందం లేదని వివరణ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని