Pakistan: అబ్బే.. ఉక్రెయిన్‌కు మేము ఆయుధాలు అమ్మట్లేదు..: పాకిస్థాన్‌

ఉక్రెయిన్‌కు పాకిస్థాన్‌ ఆయుధాలు సరఫరా చేస్తోందని ఓ ఇన్వెస్టిగేటివ్‌ పత్రిక నివేదికను ప్రచురించింది. ఐఎంఎఫ్‌ ప్యాకేజీ కోసమే ఇదంతా చేస్తోందని వెల్లడించింది. అయితే.. పాక్‌ దీనిని ఖండించింది.

Updated : 19 Sep 2023 13:13 IST

ఇంటర్నెట్‌డెస్క్: పాకిస్థాన్‌ (Pakistan) ఐఎంఎఫ్‌ ప్యాకేజీ పొందేందుకు ఏకంగా ఉక్రెయిన్‌ (Ukraine)కు ఆయుధాలను సరఫరా చేస్తోందనే నివేదికలు వెలువడుతున్నాయి. అయితే.. ఈ నివేదికలను పాక్‌ విదేశాంగశాఖ కార్యాలయం తోసిపుచ్చింది. ఈ మేరకు కార్యాలయ ప్రతినిధి ముంతాజ్‌ జారా బలోచ్‌ మాట్లాడుతూ.. అటువంటి ఆరోపణలు పూర్తిగా ఆధార రహితమని, అభూత కల్పనలని ఖండించారు.

‘ఇంటర్‌సెప్ట్‌’ అనే ఇన్వెస్టిగేటివ్‌ వెబ్‌సైట్‌ ఆదివారం ఓ నివేదికను ప్రచురించింది. దీనిలో అమెరికా సాయంతో ఐఎంఎఫ్‌ బెయిలౌట్‌ ప్యాకేజీ పొందేందుకు పాకిస్థాన్‌ రహస్యంగా ఉక్రెయిన్‌కు ఆయుధాలు విక్రయిస్తోందని పేర్కొంది. అమెరికా ఒత్తిడితోనే పాకిస్థాన్‌ ఈ సంక్షోభంలో తలదూర్చిందని వెల్లడించింది. దాదాపు ఏడాది నుంచి క్రెమ్లిన్‌, వైట్‌ హౌస్‌ మధ్య సమతౌల్యం పాటించేందుకు యత్నిస్తున్న సమయంలో ఈ నివేదిక బయటకు రావడం ఇస్లామాబాద్‌కు తలనొప్పిగా మారింది. 

‘‘కష్టతరమైన ఆర్థిక సంస్కరణల కోసం ఐఎంఎఫ్‌తో చర్చలు విజయవంతంగా జరిగాయి. దీనికి వేరే కోణాలు ఆపాదించడం తగదు. రెండు దేశాల మధ్య సంక్షోభం విషయంలో పాకిస్థాన్‌ తటస్థ వైఖరిని బలంగా పాటిస్తోంది. ఎవరికీ ఆయుధాలు, మందుగుండు అందించడంలేదు. కఠినమైన ఎండ్‌ యూజర్‌ సమాచారం లభించాకే పాక్‌ ఆయుధాలు సరఫరా చేస్తుంది’’ అని డాన్‌ పత్రిక వద్ద ముంతాజ్‌ వివరణ ఇచ్చారు.

భారత్‌-కెనడా మధ్య ముదిరిన ఖలిస్థానీ చిచ్చు.. మన రాయబారిపై ట్రూడో బహిష్కరణ వేటు

ఈ ఏడాది జులైలో ఉక్రెయిన్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి దిమిత్రి కులేబ పాక్‌లో పర్యటించిన సమయంలో కూడా ఇటువంటి ప్రచారమే జరిగింది. కానీ, అప్పట్లో ఆయన వాటిని తోసిపుచ్చారు. తమ మధ్య ఆయుధ పంపిణీ ఒప్పందం లేదని వివరణ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని