Israel-Hamas Conflict: రఫాలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు.. 35 మంది మృతి

Israel-Hamas Conflict: హమాస్‌ ఆదివారం ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్‌ చేసిన వైమానిక దాడుల్లో 35 మంది మృతిచెందినట్లు గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Published : 27 May 2024 08:37 IST

Israel-Hamas Conflict | దేర్‌ అల్‌ బలాహ్‌: గాజాలోని రఫాలో ఇజ్రాయెల్‌ (Israel) ఆదివారం జరిపిన దాడుల్లో దాదాపు 35 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. మృతులు, గాయపడిన వారిని తీసుకెళ్లేందుకు రఫాలో సరిపడా సామర్థ్యం ఉన్న ఆసుపత్రులేమీ లేవని పేర్కొంది.

ఇజ్రాయెల్‌ (Israel) వైమానిక దాడులు చేసిన ప్రాంతం వలసదారులతో కూడిన క్యాంప్‌ అని పాలస్తీనా రెడ్ క్రిసెంట్‌ సొసైటీ వెల్లడించింది. ఘటనాస్థలానికి చెందిన అనేక వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతుండడం, సహాయక సిబ్బంది చర్యల్లో నిమగ్నమై ఉండడం వాటిలో కనిపిస్తోంది. చాలా కుటుంబాలు తలదాచుకుంటున్న ఓ పెద్ద కంటైనర్‌, దాని చుట్టూ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్లపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడినట్లు గాజా ఆరోగ్య శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు.

ఈ ప్రాంతాలన్నింటినీ ఇజ్రాయెల్‌ స్వయంగా సురక్షితమైనవిగా గుర్తించిందని గాజా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పౌరులు, వలసదారులు అక్కడ తలదాచుకోవాలని సూచించిందని తెలిపాయి. చివరకు ఇలా దాడి చేయడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్‌ రక్షణ దళాల (IDF) వాదన మాత్రం భిన్నంగా ఉంది. ఆ ప్రాంతాల్లో హమాస్‌ (Hamas) మిలిటెంట్లు తలదాచుకున్నారని.. అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని తెలిపింది. దీన్ని ధ్రువీకరించుకున్న తర్వాతే దాడికి పాల్పడ్డామని వివరించింది. తమ దాడుల వల్ల కొంత మంది సామాన్య పౌరులు సైతం ప్రభావితమైనట్లు తెలుసని ప్రకటించింది.

ఈ దాడిలో మరణించిన వారిలో జుడియా, సమరియాలోని హమాస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌లు సహా మరో సీనియర్‌ అధికారి ఉన్నట్లు ఐడీఎఫ్‌ వెల్లడించింది. అంతకుముందు ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌పై హమాస్‌ (Hamas) రాకెట్ల వర్షం కురిపించింది. రాజధానిలో సైరన్లు మోగాయి. భారీగా పొగలు వస్తున్న దృశ్యాలూ కనిపించాయి. టెల్‌ అవీవ్‌లో సైరన్లు మోగడం ఐదు నెలల కాలంలో ఇదే తొలిసారి. టెల్‌ అవీవ్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలపైనా హమాస్‌ రాకెట్ల దాడి చేసిందని ఇజ్రాయెల్‌ వర్గాలు పేర్కొన్నాయి.

మరోవైపు ఇజ్రాయెల్‌ దళాలు జరిపిన దాడుల్లో దక్షిణ లెబనాన్‌లో ఎనిమిది మంది మరణించినట్లు ఆ దేశ సైనిక వర్గాలు తెలిపాయి. వీరిలో తమ గ్రూప్‌నకు చెందిన నలుగురు వ్యక్తులు ఉన్నారని మిలిటెంట్‌ గ్రూప్‌ హెజ్‌బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్‌కు త్వరలో సర్‌ప్రైజ్‌ ఇస్తామంటూ హెజ్‌బొల్లా ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసింది. ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరులో ఈ మిలిటెంట్‌ గ్రూప్‌ పాలస్తీనాకు మద్దతుగా దాడులు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని