Myanmar Earthquake: పేకమేడల్లా కూలిపోవడం.. పెను సవాల్‌గా!

Eenadu icon
By International News Team Published : 02 Apr 2025 00:02 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: నిమిషాల వ్యవధిలో వచ్చిన భారీ భూకంపాలతో ఇటీవల మయన్మార్‌ (Myanmar Earthquake) కుదేలైంది. బలమైన ప్రకంపనల ధాటికి అనేక నిర్మాణాలు, భవనాలు ఎక్కడికక్కడ పేకమేడల్లా (Pancake Collapse) కూలిపోయాయి. ఈ పరిస్థితే ప్రస్తుతం సహాయక చర్యలకు పెను సవాల్‌గా మారినట్లు తెలుస్తోంది. భవంతుల ఫ్లోర్లు ఒకదానిపై ఒకటి కుప్పకూలిపోవడంతో వాటిలో చిక్కుకుపోయిన వారిని గుర్తించడం కష్టతరంగా మారుతున్నట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల కోసం భారత్‌ నుంచి మయన్మార్‌కు వెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు శిథిలాల నుంచి ఇప్పటివరకు 14 మంది మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు.

‘‘మయన్మార్‌లోని భూకంప బాధిత నగరమైన ‘మాండలే’లో ఎన్డీఆర్‌ఎఫ్‌ నిపుణులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ‘సెక్టార్‌ డీ’ విపత్తు సహాయ ప్రణాళికలో భాగంగా 13 భవనాల శిథిలాల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రతికూలతలు ఎదురవుతున్నప్పటికీ.. ప్రాణాలతో ఉన్నవారి కోసం అన్వేషిస్తున్నారు. వారి ఆశలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. అద్భుతాలు జరిగే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే.. 2023లో తుర్కియే భూకంపం సమయంలో 17 రోజుల అనంతరం కూడా ఒకరు ప్రాణాలతో కనిపించారు’’ అని భారత్‌ నుంచి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు ఓ వార్తా సంస్థకు తెలిపారు.

‘‘చాలావరకు భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. ఇది సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. భారీ స్లాబ్‌లను కోసేందుకు గంటల తరబడి సమయం పడుతోంది. ఆ శిథిలాలను తరలించాక.. బతికి ఉన్నవారి కోసం వెతకాల్సి వస్తోంది. భవనాలు ఒకపక్కకు ఒరిగిపోయి ఉంటే.. ప్రాణాలతో ఉన్నవారి విషయంలో మరిన్ని ఆశలు ఉండేవి’’ అని చెప్పారు. ఇదిలాఉండగా.. శిథిలాల్లో సజీవంగా ఉన్నవారిని పసిగట్టగల నాలుగు జాగిలాలనూ ఎన్డీఆర్‌ఎఫ్‌ ఉపయోగిస్తోంది. అదేవిధంగా భూకంప బాధితులకు సహాయ సామగ్రిని పంపిణీ చేయడంలో స్థానిక యంత్రాంగానికి అండగా నిలవాలంటూ ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి.

భూవిలయానికి మయన్మార్‌లో మృతుల సంఖ్య ఇప్పటివరకు 2700 దాటింది. విపత్కర సమయంలో పొరుగు దేశానికి అండగా నిలిచేందుకు ‘ఆపరేషన్‌ బ్రహ్మా’ పేరిట భారత్ ఇప్పటికే రంగంలోకి దిగింది. పెద్దఎత్తున సహాయక సామగ్రి చేరవేస్తోంది. మరోవైపు.. 80మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం సహాయక చర్యల్లో పాల్గొంటోంది. అయితే.. ఇప్పటికీ రెస్క్యూ సిబ్బంది చేరుకోలేని ప్రభావిత ప్రాంతాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వివిధ దేశాల నుంచి వస్తున్న సహాయక బృందాలు భూకంప తాకిడి ప్రాంతాలకు వెళ్లేందుకు ఆయా చోట్ల ప్రభుత్వ, తిరుగుబాటు దళాల మధ్య జరుగుతున్న ఘర్షణలు అవరోధంగా మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు