USA: భారత్‌-అమెరికాలది అత్యంత విజయవంతమైన భాగస్వామ్యం..

భారత్‌తో తమ మిత్రత్వం అత్యంత ప్రయోజనకరమైందని అమెరికా తెలిపింది. డ్రోన్ల డీల్‌కు ఆమోద ముద్ర వేసిన కొన్ని గంటల్లోనే ఈ ప్రకటన వెలువడింది.

Updated : 02 Feb 2024 16:19 IST

ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌(India)తో తమ బంధం అత్యంత విజయవంతమైందని అమెరికా (USA) తెలిపింది. దాదాపు 4 బిలియన్‌ డాలర్ల విలువైన సాయుధ డ్రోన్లను న్యూదిల్లీకి విక్రయించేందుకు అంగీకరించినట్లు ఆ దేశ కాంగ్రెస్‌కు వెల్లడించిన కొద్దిసేపట్లోనే ఈ ప్రకటన వెలువడింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ విలేకర్లతో మాట్లాడుతూ..‘‘నేనొక విషయం చెప్పదల్చుకొన్నాను. అమెరికాతో ఫలవంతమైన భాగస్వామ్యాలున్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. మా కీలక ప్రయోజనాలను కాపాడుకునేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తున్నాం. ప్రస్తుతం అమెరికా నుంచి వెళుతున్న భారత రాయబారి తరణ్‌జీత్‌ సింగ్‌ సంధుతో మంచి అనుబంధం ఉంది. ఇండో-పసిఫిక్‌లో శాంతి, సుస్థిరత, స్వేచ్ఛా నౌకాయానాన్ని కాపాడే అంశాల్లో భారత్‌ పాత్ర కోసం కలిసి పనిచేశాం’’ అని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు బ్లింకన్‌-జైశంకర్‌ చాలా కీలక అంశాల్లో సమష్టి కృషి చేశారన్నారు. ఇప్పటికే ముఖ్యమైన అంశాలను చర్చించేందుకు తమ మంత్రి పలు మార్లు న్యూదిల్లీని సందర్శించినట్లు వెల్లడించారు.

పెట్రోలు, ఎరువుల ధరలపై రైతన్నలు భగ్గు

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర జరిగిందన్న అంశంపై భారత్-అమెరికా మధ్య వివాదం నెలకొందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఎంక్యూ-9బీ సాయుధ డ్రోన్ల విక్రయాలను నిలిపేసినట్లు వార్తలొచ్చాయి. అదే సమయంలో బైడెన్‌ కార్యవర్గం మాత్రం ఈ డ్రోన్ల విక్రయానికి ఆమోదముద్ర వేసి దేశ కాంగ్రెస్‌కు నోటిఫై చేసింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ భద్రత సహకార సంస్థ తెలిపింది. ‘‘ఈ డ్రోన్లను భారత్‌కు విక్రయించడం వల్ల అమెరికా విదేశాంగ విధానానికి ఊతం లభిస్తుంది. మన ప్రధాన రక్షణ భాగస్వామి, ఇండో-పసిఫిక్‌, దక్షిణాసియా ప్రాంతంలో శాంతి, ఆర్థిక పురోగతికి చాలా కీలకమైన భారత భద్రతను మెరుగుపరుస్తుంది’’ అని ఆ సంస్థ పేర్కొంది. ప్రధాని మోదీ గతేడాది అమెరికాలో పర్యటించినప్పుడు ఈ ఒప్పందం చేసుకున్నారు. దీని కింద వాషింగ్టన్‌ 31 డ్రోన్లు విక్రయించనుంది. వీటితోపాటు హెల్‌ఫైర్‌ క్షిపణులు, ఇతర నిఘా పరికరాలు కూడా భారత్‌కు అందనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని