Inventions : ఇవి కనిపెడితే మానవాళికి మేలు!

ప్రతి ఆవిష్కరణకు (Invention) ఓ ప్రయోజనం ఉంటుంది. అది సమయాన్ని (Time), ధనాన్ని (Money) ఆదా చేసి మానవుడి జీవితాన్ని సుఖమయం చేస్తుంది. 

Published : 31 Mar 2023 12:20 IST

మానవుల ఆవిష్కరణల్లో (Inventions) కృత్రిమ మేధ (Artificial intelligence) ఒకటి. ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ చాట్‌జీపీటీని (Chat gpt) అభివృద్ధి చేసిన ఓపెన్‌ఏఐ సంస్థ ఇటీవల జీపీటీ-4 పేరిట మరింత అత్యాధునిక ఏఐ వ్యవస్థను పరిచయం చేసింది. ఇలాంటివి మానవాళి మనుగడకు ముప్పు తెస్తాయని పలువురు నిపుణులు ‘పాజ్‌ జియాంట్‌ ఏఐ ఎక్స్‌పెరిమెంట్స్‌’ పేరిట బహిరంగ లేఖ రాశారు. అందులో ట్విటర్‌ (Twitter) సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon musk), యాపిల్‌ (Apple) సహ-వ్యవస్థాపకుడు స్టీవ్‌ వోజ్నియాక్‌ సహా 1,000 మంది సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కనిపెట్టని.. కనిపెడితే మానవాళికి ప్రయోజనకరంగా ఉండే ఆవిష్కరణల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం..

కలల రికార్డర్‌

ఏంటీ కలను రికార్డు చేయాలా? అసాధ్యం అని అనుకోవద్దు. కానీ, ఇది భవిష్యత్తులో సుసాధ్యం కావచ్చు. కలలు నిజమవుతాయంటారు కదా. ఇదీ అలాగే అనుకోండి. కలలో అప్పుడప్పుడు కొన్ని మంచి ఆలోచనలు వస్తుంటాయి. మనం జీవితంలో ఎదగడానికి తోడ్పడే ఆ ఆలోచనలు కలలోనే సమాధి అవుతుంటాయి. మరుసటి రోజు నిద్ర లేవగానే ఏమీ గుర్తుండవు. అదే కలలు ఒక డివైజ్‌లో రికార్డయితే తరువాత వాటిని పరిశీలించవచ్చు. జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు అవి పరిష్కారం చూపే అవకాశం ఉంటుంది.

యాంటీ బయోటిక్స్‌కు ప్రత్యామ్నాయం

వ్యాధుల నుంచి తాత్కాలిక ఉపశమనం పొందేందుకు యాంటీ బయోటిక్స్‌ వాడకం పెరిగింది. దీంతో అదే స్థాయిలో దుష్పరిణామాలూ ఉంటున్నాయి. యాంటీ బయోటిక్స్‌కు ప్రత్యామ్నాయంగా ‘ఫేజ్‌ థెరపీ’ ఉపయోగపడుతుందని అంటున్నారు. అది పూర్తిగా నిరూపితం కాలేదు. అందుకే యాంటీ బయోటిక్స్‌కు ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ కొనసాగుతోంది.

మానవ-జంతువుల భాష అనువాదం

మన చుట్టూ జంతు ప్రేమికులు అనేక మంది ఉంటారు. వారు పెంపుడు జంతువులతో మాట కలుపుతుంటారు. ఆ సమయంలో అవి కొన్ని శబ్దాలు చేస్తాయి. వాటికి అర్థాలు తెలుసుకోవడానికి మానవ-జంతువుల భాష అనువాద పరికరం తోడ్పడుతుంది. జంతువుల అరుపులను బట్టి అవి ఏం కోరుకుంటున్నాయో తెలుసుకొనే సాధనాలు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. అవి కొన్ని జంతువులకు మాత్రమే పని చేస్తాయంటున్నారు. అందుకే అన్ని జంతువుల భాషలు మనుషులకు, మనుషులు చెప్పే మాటలు జంతువులకు అర్థమయ్యే పరికరాలు మార్కెట్లోకి రావాలని జంతు ప్రేమికులు ఆశిస్తున్నారు. 

సర్వ రోగ నివారిణి

గ్రీకులు ‘పనాసియా’ అనే దేవతను ఆరాధించేవారట. ఆ పదానికి అర్థం ‘సర్వ రోగ నివారిణి’. హెచ్‌ఐవీ, క్యాన్సర్‌ వంటి భయానక రోగాలతో ఎంతో మంది సతమతమవుతున్నారు. వైద్యుల వద్దకు వెళితే జలుబుకు ఒక మాత్ర, దగ్గుకు ఒక మాత్ర ఇలా పది రకాలు రాసిస్తుంటారు. ఒక్కటి వేసుకుంటే అన్ని రోగాలు తగ్గే మాత్ర ఈ భూమ్మీద లేదా? అనే ఆలోచనే ‘సర్వ రోగ నివారిణి’. పెన్సిలిన్‌ చాలా రోగాలు రాకుండా నివారిస్తుంది. అదే తరహాలో ఒక మందు కనిపెడితే మానవులందరూ హాయిగా జీవించొచ్చు. 

కాంతి వేగంతో ప్రయాణం

ప్రయాణం అనగానే కొందరు పెదవి విరుస్తారు. వికారంగా ఉంటుందనో, అలసి పోతామనో.. ఇలా రకరకాల కారణాలతో ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపించరు. అదే కాంతి వేగంతో ప్రయాణించే వాహనం అందుబాటులోకి వస్తే సెకన్ల వ్యవధిలోనే ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్లిపోవచ్చు. అంతే కాదండోయ్‌ సులువుగా ఇతర గ్రహాలకు వెళ్లిపోవచ్చు. అక్కడ వాతావరణం నచ్చకపోతే మరో గ్రహానికి పెట్టాబేడా సర్దుకోవచ్చు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని