Pakistan Russia: పురుగుల బియ్యం.. పాకిస్థాన్‌కు రష్యా వార్నింగ్!

పాకిస్థాన్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యంలో పురుగులు రావడంపై రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో దిగుమతులను నిలిపేస్తామని హెచ్చరించింది.

Published : 22 Apr 2024 00:03 IST

మాస్కో: పాకిస్థాన్‌ (Pakistan) నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యంలో నాణ్యత లోపాలపై రష్యా (Russia) ఆందోళన వ్యక్తం చేసింది. అందులో హానికర పురుగులు ఉన్నట్లు గుర్తించింది. ఈ సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో దిగుమతులను నిలిపేస్తామని హెచ్చరించింది. పాక్‌ బియ్యం అంతర్జాతీయ, స్థానిక ప్రమాణాలకు అనుగుణంగా లేదని రష్యా ప్రభుత్వ సంస్థ (FSVPS) తేల్చిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇస్లామాబాద్‌ నుంచి దిగుమతి చేసుకున్న బియ్యంలో పురుగులు ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది.

స్థానిక పాకిస్థాన్‌ దౌత్య కార్యాలయంలోని వాణిజ్య అధికారులు ఈ వ్యవహారంపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని మాస్కో డిమాండ్‌ చేసింది. నాణ్యత ప్రమాణాల ఉల్లంఘనకు అడ్డుకట్ట వేయాలని, వ్యవసాయ ఉత్పత్తుల భద్రతను నిర్ధరించేందుకు బియ్యం ఎగుమతిదారులందరూ తగు చర్యలు తీసుకోవాలని లేఖ రాసింది. ఇదే విషయాన్ని స్వదేశంలోని ప్రభుత్వ విభాగాలకు చేరవేసిన పాక్‌ దౌత్య కార్యాలయ అధికారులు.. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మన బియ్యం దిగుమతులపై మాస్కో నిషేధం విధించే అవకాశం తెలిపారు.

ఇజ్రాయెల్‌ దళంపై అమెరికా ఆంక్షలు?.. మండిపడ్డ నెతన్యాహు!

ఆరోగ్య భద్రత కారణాలతో 2019లో పాకిస్థాన్‌ నుంచి బియ్యం దిగుమతులపై మాస్కో నిషేధం విధించింది. ఆహార నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేని కారణంగా 2006లోనూ ఓసారి దిగుమతులను నిలిపేసింది. ఇదిలా ఉండగా.. బియ్యం ఎగుమతులపై గతేడాది భారత్ విధించిన నిషేధం.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్‌కు కాసులవర్షం కురిపించింది. ఆ దేశ బియ్యానికి డిమాండ్ పెరిగింది. అమెరికా, బ్రిటన్, ఐరోపా దేశాల నుంచి ఆర్డర్లు వచ్చాయని ఎగుమతిదారులు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని