Earthquake: జపాన్‌ భూకంపం.. కిషిదాకు ప్రధాని మోదీ లేఖ!

భూకంపం వల్ల నష్టపోయిన జపాన్‌తోపాటు అక్కడి ప్రజలకు భారత్‌ తరఫున సంఘీభావం తెలుపుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు.

Published : 05 Jan 2024 16:44 IST

దిల్లీ: భారీ భూకంపం (Japan Earthquake)తో ఇటీవల జపాన్‌ పశ్చిమ తీరం వణికిపోయింది. 7.6 తీవ్రతతో ‘నోటో’ సమీపంలో సంభవించిన ప్రకృతి విపత్తు ధాటికి అనేక ఇళ్లు, ఇతర భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూకంపం వల్ల నష్టపోయిన జపాన్‌తోపాటు అక్కడి ప్రజలకు భారత్‌ తరఫున సంఘీభావం తెలుపుతూ ఆ దేశ ప్రధాని కిషిదా (Fumio Kishida)కు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామిగా జపాన్‌తో తన అనుబంధాన్ని భారత్‌ విలువైనదిగా పరిగణిస్తుందని ప్రధాని మోదీ లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనపై తీవ్ర వేదనకు లోనయ్యానని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రస్తుత విపత్కర సమయంలో భారత్‌ తరఫున సాధ్యమైన మేర సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు.

జపాన్‌ భూకంపంలో 242 మంది ఆచూకీ గల్లంతు..!

ఇటీవలి భూకంపానికి జపాన్‌లో ఇప్పటివరకు 92 మంది మృతి చెందారు. 240 మందికిపైగా పౌరుల ఆచూకీ లభించాల్సి ఉంది. సహాయక చర్యల్లో పాల్గొనే సిబ్బంది సంఖ్యను అధికారులు రెట్టింపు చేసి, 4,600కు పెంచారని స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి. బాధితులను ఆదుకోవడంలో ఎటువంటి అవకాశాలను వదిలేయవద్దని, చివరి వరకు ప్రయత్నాలు కొనసాగించాలని అధికారులకు ప్రధాని కిషిదా ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని