Japan: అయ్యో ఆర్కాస్‌.. ఊపిరాడక విలవిల్లాడుతున్న మూగజీవాలు!

జపాన్‌లో అరుదైన ఆర్కాస్‌ తిమింగలాలు మంచుఫలకాల మధ్యలో ఇరుక్కుపోయి ఊపిరాడక విలవిల్లాడుతున్నాయి.

Updated : 07 Feb 2024 10:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జపాన్‌(Japan)లో ఇటీవల మొదలైన రికార్డు స్థాయి హిమపాతం అరుదైన కిల్లర్‌ వేల్స్‌ (ఆర్కాస్‌)కు ప్రాణాంతకంగా మారింది. ఉత్తర జపాన్‌లోని హక్కైడో తీరంలో గల రౌస్‌ అనే ప్రదేశానికి కిలోమీటరు దూరంలో గడ్డకట్టిన నీటి మధ్య చిన్న ఖాళీ ప్రాంతంలో దాదాపు 10 కిల్లర్‌ వేల్స్‌ చిక్కుకుపోయాయి. ఇవి కదలడానికి చోటు లేకపోవడంతో.. తలలను నీటి బయటపెట్టి భారంగా శ్వాస తీసుకొంటున్నాయి. దీనికి సంబంధించిన దృశ్యాలను జపాన్‌కు చెందిన జాతీయ టెలివిజన్‌ ఛానెల్‌ ప్రసారం చేసింది. ఆ మూగజీవాలు గాలి ఆడక అవస్థ పడుతున్న తీరు చూసి జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన విషయం తెలిసిందే. కిల్లర్‌ వేల్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏటా రౌస్‌ వద్దకు భారీ సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు.

తొలుత ఈ దృశ్యాలను చూసిన కొందరు మత్స్యకారులు అధికారులను అప్రమత్తం చేశారు. ఆర్కాస్‌ను రక్షించేందుకు అక్కడకు చేరుకోవడం కోస్టుగార్డ్‌కు సవాలుగా మారింది. అక్కడి నీరు మొత్తం మందపాటి మంచుఫలకం వలే మారిపోయింది. మంచు కరిగి ఆ ఫలకం విరిగిపోయే వరకు తాము ఏమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. ఇటీవల శీతాకాల ప్రభావంతో జపాన్‌ ఉత్తర తీరాన్ని మంచు దుప్పటి కప్పేసింది.

2005లో కూడా ఇలానే మంచులో ఆర్కాస్‌ చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయాయి. ఆ ఘటన కూడా రౌస్‌ సమీపంలోనే చోటు చేసుకొంది. ఉత్తరార్ధ గోళంలో లోతట్టు ప్రాంతంగా హక్కైడోను భావిస్తుంటారు. గతంలో ఇక్కడ భారీగా మంచు గడ్డకట్టి ఉండేదని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

హెలికాప్టర్‌ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడు మృతి

ఆర్కాస్‌ కూడా డాల్ఫిన్‌ కుటుంబానికి చెందినవే. కానీ, ఇవి మిగిలిన తిమింగలాల మాదిరిగా చిన్న చేపల్ని కాకుండా పెద్దచేపలు, పెంగ్విన్లను, సముద్రపు తాబేళ్లను, పక్షులను వేటాడి తింటాయి. శరీర నిర్మాణమూ, జీవన విధానాలకు సంబంధించి ఎన్నో విషయాల్లో తిమింగలాలు మనుషుల్ని పోలి ఉంటాయి. వాటిల్లోనూ వెచ్చని రక్తం ఉంటుంది. బిడ్డను కని, పాలిచ్చి పెంచుతాయి. పెద్ద మెదడు, ఊపిరితిత్తులు ఉంటాయి. అయితే ఊపిరి తీసుకోవడంలో మాత్రం తేడా ఉంది. మనం ఒకసారి శ్వాస లోపలికి తీసుకుంటే అందులో 15 శాతం ఆక్సిజన్‌ను మాత్రమే శరీరం గ్రహించగలుగుతుంది. తిమింగలాలు అలా కాదు, అవి ఒక్క శ్వాస నుంచి 90 శాతం ఆక్సిజన్‌ను గ్రహిస్తాయి. అందుకే చాలాసేపు గాలి పీల్చకుండా నీటిలో ఉండిపోగలవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని