Putin: ప్రేయసిని 111 సార్లు పొడిచి చంపిన క్రూరుడికి పుతిన్‌ క్షమాభిక్ష.. కారణమిదే..!

ప్రేయసిని అతి క్రూరంగా హతమార్చిన ఓ రష్యన్‌ నేరస్థుడికి పుతిన్‌ క్షమాభిక్ష ప్రసాదించడం చర్చనీయాంశమైంది.

Published : 11 Nov 2023 16:03 IST

మాస్కో: తన ప్రేయసిని వందసార్లకుపైగా పొడిచి హత్య చేసిన ఓ క్రూరుడికి రష్యా (Russia) అధ్యక్షుడు పుతిన్‌ (Putin) క్షమాభిక్ష ప్రసాదించారు. దీంతో ఈ వ్యవహారం కాస్త తీవ్ర విమర్శలకు దారితీసింది. ఉక్రెయిన్‌పై రష్యా చేపడుతోన్న దండయాత్ర(Ukraine War)లో అతడు పాల్గొనడం వల్లే పుతిన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై దాడులకు వీలుగా రష్యా ప్రభుత్వం సైనిక సమీకరణలు చేపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు కరడుగట్టిన ఖైదీలనూ విడుదల చేస్తూ.. యుద్ధక్షేత్రానికి తరలిస్తోంది.

బ్రేకప్‌ చెప్పిందన్న ఆగ్రహంతో వ్లాదిస్లావ్‌ కాన్యుస్‌ అనే వ్యక్తి తన ప్రేయసిని 111 సార్లు పొడిచి హతమార్చాడు. అంతకుముందు ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతోపాటు మూడున్నర గంటలపాటు క్రూరంగా హింసించినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. ఈ కేసులో దోషిగా తేలిన అతడికి కోర్టు 17 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కానీ.. ఏడాది తిరగకముందే అతడు విడుదలయ్యాడు. ఆయుధం చేతపట్టి, సైన్యం దుస్తుల్లో అతడి ఫొటోలు చూసి మృతురాలి తల్లి హతాశురాలయ్యారు. ‘ఇది నాకు శరాఘాతం లాంటిదే. నా బిడ్డ ఆత్మ కూడా కుమిలిపోతుంది. ఇటువంటి చట్టవిరుద్ధ చర్యలు దారుణం. నాకేం చేయాలో పాలుపోవడం లేదు’ అని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

14 గంటల్లో 800 ప్రకంపనలు.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ఐస్‌లాండ్‌

కాన్యుస్‌ను ఉక్రెయిన్‌ సరిహద్దులోని రోస్తోవ్‌కు తరలించినట్లు జైలు అధికారులు వెల్లడించారని స్థానిక మహిళా హక్కుల కార్యకర్త అల్యొనా పొపవా తెలిపారు. కాన్యుస్‌కు క్షమాభిక్ష ప్రసాదించినట్లు, రష్యా అధ్యక్షుడి ఆదేశాల మేరకు అతడి నేరాన్ని రద్దు చేసినట్టు రష్యా ప్రాసిక్యూటర్ జనరల్ ఆఫీస్ నుంచి వచ్చిన ఒక లేఖను ఆమె పంచుకున్నారు. మరోవైపు.. కాన్యుస్‌ విడుదలపై విమర్శలు వెల్లువెత్తడంతో క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ స్పందించారు. తమ విధానాలను సమర్థించుకున్నారు. ఉక్రెయిన్‌లో పోరాడటానికి పంపిన రష్యన్ ఖైదీలు.. వారి నేరాలకు రక్తంతో ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నట్లు చెప్పారని ఓ వార్తాసంస్థ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని