Putin: నావల్నీని విడిచిపెట్టాలనుకున్నాం.. ప్రత్యర్థి మృతిపై పుతిన్‌ తొలి స్పందన

Putin: గత నెల జైలులో అనుమానాస్పద స్థితిలో మరణించిన రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిపై ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ తొలిసారి స్పందించారు.

Updated : 18 Mar 2024 08:48 IST

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) తొలిసారి తన ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ మృతిపై స్పందించారు. ఖైదీల మార్పిడి కింద నావల్నీని రష్యా జైలు నుంచి విడుదల చేయాలనుకున్నట్లు తెలిపారు. అంతలోనే ఆయన మరణించారని అన్నారు. తాజా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు అనంతరం ప్రసంగిస్తూ సోమవారం పుతిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్లలో ఆయన నావల్నీ పేరెత్తడం ఇదే తొలిసారి.

‘‘ఖైదీల మార్పిడి కింద నావల్నీ (Alexei Navalny)ని అప్పగించి పాశ్చాత్య దేశాల జైళ్లలో ఉన్న కొంతమంది వ్యక్తులను రష్యాకు (Russia) తీసుకొద్దామనే ఆలోచనను సహచరులు నా ముందుంచారు. మీరు నమ్ముతారో.. లేదో.. ఆ వ్యక్తి తన మాటల్ని ముగించకముందే నా అంగీకారాన్ని తెలియజేశాను. అయితే, నావల్నీ తిరిగి రష్యాకు రావొద్దనే షరతు విధించాను. కానీ, అంతలోనే ఇలా జరిగింది. జరిగిందేదో జరిగిపోయింది. ఇది జీవితం’’ అని పుతిన్‌ వ్యాఖ్యానించారు.

ఖైదీల మార్పిడి కింద నావల్నీని (Navalny) రష్యా నుంచి విడుదల చేయాలనుకుంటున్నట్లు ఆయన సహచరులు సైతం గత నెలలో తెలిపారు. ఈ మేరకు జరుగుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని ఆయన మరణానికి కొన్ని రోజుల ముందు వెల్లడించారు. అయితే, పుతిన్‌కు ఇది ఇష్టం లేదని అందుకే ఈ కుట్రకు తెరతీశారని నావల్నీ మృతి తర్వాత ఆయన మద్దతుదారులు ఆరోపించారు.

భారీ ఆధిక్యంతో పుతిన్‌కు పట్టం!

జర్మనీలో జైలు జీవితం గడుపుతున్న వాడిమ్ క్రాసికోవ్ కోసం రష్యా తమ దేశ కారాగారాల్లో ఉన్న నావల్నీ సహా మరో ఇద్దరు అమెరికా పౌరులను విడదుల చేయాలనుకున్నట్లు మరియా పెవ్చిఖ్ వెల్లడించారు. నావల్నీకి పెవ్చిఖ్‌ రాజకీయ సహచరి. 2019లో బెర్లిన్‌లో జెలిమ్‌ఖాన్ ఖంగోష్విలి హత్యలో దోషిగా తేలిన క్రాసికోవ్ ప్రస్తుతం జర్మనీ జైల్లో ఉన్నాడు. రష్యా ఆదేశాల మేరకే క్రాసికోవ్‌ ఈ నేరానికి పాల్పడ్డాడని కోర్టు తీర్పు వెలువరించింది. అతని కోసమే నావల్నీతో పాటు దేశద్రోహం కింద అరెస్టయిన ఇద్దరు అమెరికా పౌరులను రష్యా విడిచి పెట్టాలనుకుంటుందని పెవ్చిఖ్‌ తెలిపారు.

అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధమే..

రష్యా, అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి మధ్య ఘర్షణ తలెత్తితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని పుతిన్‌ అన్నారు. అయితే, దీన్ని ఎవరూ కోరుకోవడం లేదని తెలిపారు. నాటో దళాలు ఇప్పటికే ఉక్రెయిన్‌లో ఉన్నాయని చెప్పారు. ఇది ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు. మరోవైపు భవిష్యత్తులో తమ సైన్యాన్ని ఉక్రెయిన్‌కు పంపే ఆలోచనను కొట్టిపారేయలేమని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ చేసిన వ్యాఖ్యలపైనా పుతిన్‌ తాజాగా స్పందించారు. ఇది రష్యా, నాటో మధ్య ప్రత్యక్ష పోరుకు దారితీయొచ్చని తెలిపారు. ఆధునిక ప్రపంచంలో ఏమైనా జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు