భారీ ఆధిక్యంతో పుతిన్‌కు పట్టం!

మూడు రోజులుగా జరుగుతున్న రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ఆదివారం ముగిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు దాదాపు 88% ఓట్లు లభించినట్లు తెలుస్తోంది.

Updated : 18 Mar 2024 05:06 IST

 88% ఓట్లు ఆయనకే

మాస్కో: మూడు రోజులుగా జరుగుతున్న రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ఆదివారం ముగిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు దాదాపు 88% ఓట్లు లభించినట్లు తెలుస్తోంది. 24 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును చేపట్టిన మీదట ఈ విషయం తేలింది. అసమ్మతి గళాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తూ 24 ఏళ్ల పాలనను మరో ఆరేళ్లు కొనసాగింపజేసుకోవాలని పుతిన్‌ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. చివరిరోజు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని, పుతిన్‌ విధానాలను వ్యతిరేకిస్తున్నవారు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి సంఘీభావం ప్రకటించాలని దివంగత విపక్ష నేత నావల్నీ మద్దతుదారులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. పలు పోలింగ్‌ కేంద్రాల్లో దౌర్జన్యకాండ చోటుచేసుకుంది. కొన్నిచోట్ల బ్యాలెట్‌ పెట్టెల్లోకి ఇంకు, ఆకుపచ్చ రంగు యాంటీసెప్టిక్‌ ద్రావణాలను పోసేశారు.

16 నగరాల్లో 65 మంది నేతలు అరెస్టయ్యారు. బలమైన ప్రత్యర్థులు గానీ, బహిరంగంగా విమర్శించేవారు గానీ లేని కఠినమైన వాతావరణంలో ఎన్నికలు కొనసాగాయి. చివరిరోజు ఓటర్ల వెల్లువకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను నావల్నీ మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. బెర్లిన్‌, పారిస్‌, మిలన్‌ తదితర నగరాల్లో ఉన్న రష్యా దౌత్య కార్యాలయాల్లో పెద్దఎత్తున ఓటర్ల సందడి కనిపించింది. మరోవైపు- ఉక్రెయిన్‌ నుంచి రష్యాపైకి డ్రోన్లు వెల్లువెత్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు