Moscow Attack: భారీ మూల్యం చెల్లించుకున్నాం.. ‘మాస్టర్‌మైండ్స్‌’ని వెతికి పట్టుకుంటాం: పుతిన్‌

మాస్కో దాడుల వెనుక సూత్రధారులను వెతికి పట్టుకుంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రతినబూనారు.

Published : 03 Apr 2024 00:03 IST

మాస్కో: ఇటీవలి మాస్కో ఉగ్రదాడి (Moscow Attack)తో భారీ మూల్యం చెల్లించుకున్నామని, దీని వెనుక ఉన్న సూత్రధారులను వెతికిపట్టుకుని తీరతామని రష్యా (Russia) అధ్యక్షుడు పుతిన్‌ (Putin) ప్రతినబూనారు. దేశవ్యాప్తంగా జనంతో రద్దీగా ఉండే ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ అంతర్గత వ్యవహారాలశాఖ ఉన్నతాధికారులతో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. రష్యాపై ఆయుధాలు ప్రయోగించేవారికి.. వాటికి రెండోవైపూ పదును ఉందనే విషయం తెలిసేలా చేయాలన్నారు.

‘‘మాస్కో ఘటనతో భారీ మూల్యం చెల్లించుకున్నాం. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలి. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులందరినీ గుర్తించడం చాలా ముఖ్యం. ఈ దాడి వెనుక ఉన్న సూత్రధారులు.. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు, ప్రజల్లో అసమ్మతి, భయాందోళనలు, కలహాలు, ద్వేషాన్ని నాటేందుకు యత్నించారు. అటువంటివారిని అనుమతించకూడదు. జాతిపరంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ఈ విషాదాన్ని ఉపయోగించడం తగదు’’ పుతిన్‌ వ్యాఖ్యానించారు.

సూర్యగ్రహణం.. అక్కడి ‘జైళ్లలో లాక్‌డౌన్‌’!

అమెరికా, దాని మిత్రదేశాలపై పుతిన్‌ మరోసారి విరుచుకుపడ్డారు. ‘‘విస్తారమైన వనరుల కోసం.. చారిత్రక రష్యాను నాశనం చేయడమే వాటి లక్ష్యం. వేగంగా మారుతోన్న ప్రపంచంలో తమ ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు మాస్కోను పణంగా పెట్టేందుకు యత్నిస్తున్నాయి. కొందరు రష్యాను బలహీనంగా భావించారు. అయితే.. వారంతా పొరపాటు పడ్డారు’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మాస్కోలోని సంగీత కచేరి హాల్‌పై ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో 140 మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి రష్యా భద్రతా సిబ్బంది 11 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. ఇందులో నేరుగా దాడిలో పాల్గొన్న నలుగురు తజకిస్థాన్‌ జాతీయులూ ఉన్నారు. ఈ అనుమానితులకు ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌తో సంబంధం ఉందని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని