PM Modi: ‘ఎన్నికల తర్వాత మా దేశాలకు రండి’.. మోదీని ఆహ్వానించిన పుతిన్‌, జెలెన్‌స్కీ

PM Modi: ప్రధాని మోదీని రష్యా, ఉక్రెయిన్‌ అధ్యక్షులు తమ దేశాలకు ఆహ్వానించారు. భారత్‌తోనే శాంతిస్థాపన జరుగుతుందని ఆ అధినేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated : 21 Mar 2024 10:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా-ఉక్రెయిన్‌ (Russia - Ukraine) వివాదం వీలైనంత త్వరగా, శాంతియుతంగా పరిష్కారం అయ్యేలా జరిగే ప్రయత్నాలకు భారత్‌ పూర్తి మద్దతిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) పునరుద్ఘాటించారు. ఆ దేశాల అధినేతలు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin), జెలెన్‌స్కీ (Zelenskyy)తో  ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీని వారిద్దరూ తమ దేశాలకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రధాని మోదీ రష్యా, ఉక్రెయిన్‌ పర్యటనలు చేపట్టాలని పుతిన్‌, జెలెన్‌స్కీ కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో భారత్‌తోనే శాంతిస్థాపన జరుగుతుందని అధినేతలిద్దరూ భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే, వారి ఆహ్వానాన్ని మోదీ అంగీకరించారా? లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ప్రధాని చివరిసారిగా 2018లో రష్యాలో పర్యటించారు.

పుతిన్‌కు మోదీ శుభాకాంక్షలు

నిన్న పుతిన్‌తో మాట్లాడిన మోదీ.. వివాద పరిష్కారానికి చర్చలు, దౌత్యపరమైన చర్యలే శరణ్యమని సూచించారు. ఆ తర్వాత జెలెన్‌స్కీతో చర్చించిన ప్రధాని.. ఆ దేశానికి మానవతా సహాయాన్ని కొనసాగిస్తుందని భరోసా ఇచ్చారు. మోదీ ఫోన్‌కాల్‌పై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు స్పందిస్తూ భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘మా సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు మద్దతిస్తూ శాంతి కోసం ప్రయత్నిస్తున్న భారత్‌కు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం. త్వరలో స్విట్జర్లాండ్‌లో జరగబోయే శాంతి సదస్సులో న్యూదిల్లీ పాల్గొనడం చాలా ముఖ్యం’’ అని అన్నారు.

గత రెండేళ్లుగా రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ దాడులు మొదలైన నాటి నుంచి ప్రధాని మోదీ పలుమార్లు ఆ దేశాధినేతలిద్దరితో ఫోన్‌లో మాట్లాడారు. శాంతియుతంగా, దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు. ఆ తర్వాత పుతిన్‌తో భేటీ అయిన మోదీ.. ఇది యుద్ధాల శకం కాదని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని