పుతిన్‌కు మోదీ శుభాకాంక్షలు

రష్యా అధ్యక్షుడిగా అయిదోసారి ఎన్నికైన వ్లాదిమిర్‌ పుతిన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 21 Mar 2024 15:38 IST

పలు అంశాలపై ఫోన్‌లో ఇరువురు నేతల చర్చ

దిల్లీ: రష్యా అధ్యక్షుడిగా అయిదోసారి ఎన్నికైన వ్లాదిమిర్‌ పుతిన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరు నేతల మధ్య జరిగిన టెలిఫోన్‌ సంభాషణలో దైపాక్షిక సహకారంలో పురోగతి, ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయిన్‌ వివాద పరిష్కారానికి చర్చలు, దౌత్యపరమైన చర్యలే శరణ్యమని ప్రధాని మోదీ మరోసారి పుతిన్‌కు సూచించారు. రానున్న సంవత్సరాల్లో రెండ[ు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసే దిశగా ప్రయత్నించేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు.

ఉక్రెయిన్‌ వివాద పరిష్కార యత్నాలకు భారత్‌ మద్దతు

రష్యా-ఉక్రెయిన్‌ వివాదం వీలైనంత త్వరగా, శాంతియుతంగా పరిష్కారం అయ్యేందుకు జరిగే అన్ని ప్రయత్నాలకు భారత్‌ మద్దతిస్తుందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీతో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆ దేశానికి మానవతా సహాయాన్ని కొనసాగిస్తుందని భరోసా ఇచ్చారు. జెలెన్‌స్కీతో బుధవారం మోదీ టెలిఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న వివాదంపై చర్చించారు. సమస్య పరిష్కారం దిశగా ముందుకు వెళ్లడానికి చర్చలు, దౌత్యపరమైన చర్యలను తీసుకోవాలని సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని