North Korea: ఉత్తర కొరియా సరిహద్దుల్లో.. లౌడ్‌స్పీకర్ల మోత!

‘చెత్త’ బెలూన్లకు ప్రతిస్పందనగా ఉత్తర కొరియా సరిహద్దుల్లో లౌడ్‌ స్పీకర్లను ఏర్పాటు చేసిన దక్షిణ కొరియా.. కిమ్‌ సర్కారుకు వ్యతిరేకంగా ప్రసారాలు ప్రారంభించింది.

Published : 10 Jun 2024 00:03 IST

సియోల్‌: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ భూభాగంలో కరపత్రాలు వెదజల్లినందుకు ప్రతిగా ఉత్తర కొరియా (North Korea) ఇటీవల వెయ్యికిపైగా బెలూన్ల ద్వారా దక్షిణ కొరియా (South Korea)లోకి చెత్త, మురికి మట్టిని జారవిడిచిన విషయం తెలిసిందే. దీన్ని సియోల్‌ ఇప్పటికే ఖండించింది. ఈ క్రమంలోనే మరోసారి బెలూన్లు కనిపించాయి. దీంతో ఉత్తర కొరియా సరిహద్దుల్లో లౌడ్‌ స్పీకర్లను ఏర్పాటు చేసి ఆ దేశానికి వ్యతిరేకంగా ప్రసారాలు ప్రారంభించింది. ఉత్తర కొరియన్లకు విదేశీ రేడియో, టీవీ ప్రసారాలు అందవు కాబట్టి ఈ మార్గాన్ని ఎంచుకుంది. దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

ద.కొరియాలోకి ఉ.కొరియా చెత్త బాంబులు

ఈ వ్యవహారంపై ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ శక్తిమంతమైన సోదరి కిమ్‌ యో జోంగ్‌ తీవ్రంగా స్పందించారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఈ చర్యలకు తక్షణమే అడ్డుకట్టవేయకపోతే ఇదివరకు చూడని విధంగా స్పందిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా.. సియోల్‌ గతంలోనూ ప్యాంగ్‌యాంగ్‌ వ్యతిరేక ప్రసారాలు, కే-పాప్ పాటలు, అంతర్జాతీయ వార్తలను వినిపించేందుకు లౌడ్ స్పీకర్లను ఉపయోగించింది. 2015లోనూ ఇలాగే చేయగా.. కిమ్‌ సర్కారు ఫిరంగి గుండ్లు పేల్చింది. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితులే ఎదురైతే దీటుగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని దక్షిణ కొరియా రక్షణ మంత్రి సైనిక బలగాలను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు