Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని వారానికి 36 గంటలు ఉపవాసం.. ఎందుకో తెలుసా?

బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ (Rishi Sunak) వారంలో 36 గంటలపాటు ఉపవాసం చేస్తున్నారని స్థానిక మీడియా వెల్లడించింది.

Published : 01 Feb 2024 02:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పండగలు, లేదా వారంలో ఏదో ఒక రోజు ఉపవాసం (Fasting) ఉండటం అనేక మందికి అలవాటే. కొందరు ఒక పూట ఉంటే, మరికొందరు రోజు మొత్తం ఉంటుంటారు. అయితే, బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ (Rishi Sunak) మాత్రం వారంలో ఏకంగా 36 గంటలపాటు ఉపవాసం చేస్తున్నారట.

ప్రతివారంలో ఆదివారం సాయంత్రం 5గంటల నుంచి మంగళవారం ఉదయం 5గంటల వరకు రిషి సునాక్‌ ఉపవాసం చేస్తున్నారట. ఆ సమయంలో కేవలం నీళ్లు, టీ లేదా బ్లాక్‌ కాఫీ మాత్రమే సేవిస్తారట. ఈ విషయాలను బ్రిటన్‌ మీడియాకు వెల్లడించిన ఆయన.. ‘సమతుల్య జీవనశైలి’లో భాగంగానే ఈ నియమాన్ని పాటిస్తున్నట్లు చెప్పినట్లు తెలిసింది.

పుతిన్‌.. మస్క్‌ను మించిన కుబేరుడా..?

ఉపవాసాన్ని ఒక్కో వ్యక్తి భిన్నంగా చేస్తారని పేర్కొన్న రిషి సునాక్‌.. మిగతా రోజుల్లో తనకు ఇష్టమైన తీపి పదార్థాలను లాగించేస్తానని చెప్పడం విశేషం. ఆహారం అంటే ఎంతో ఇష్టమని, పదవీ బాధ్యతల దృష్ట్యా గతంలో మాదిరిగా వ్యాయామం చేయడం లేదన్నారు. అందుకే వారం ప్రారంభంలో ఇదో చిన్న రీసెట్‌ వంటిదని వివరించారు.

ఇదే అంశంపై సునాక్‌ సన్నిహితులు స్పందిస్తూ.. సోమవారం మొత్తం తినకుండా ఉండటం గొప్ప విషయమన్నారు. ఆరోజు కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. వృత్తి, వ్యక్తిగత జీవితంలో అన్ని కోణాల్లో ఏకాగ్రత, క్రమశిక్షణకు ఇది నిదర్శనమని వారు చెప్పినట్లు బ్రిటన్‌ మీడియా పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని