Putin-Musk: పుతిన్‌.. మస్క్‌ను మించిన కుబేరుడా..?

సంపద విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin)..మస్క్‌(Musk) కంటే ముందుంటారట. ఈ విషయాన్ని ఒకసారి టెస్లా సీఈఓనే స్వయంగా వెల్లడించారు. 

Updated : 31 Jan 2024 18:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: త్వరలో రష్యా(Russia)లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అధ్యక్షుడు పుతిన్‌(Putin) ఎన్నికల సంఘం వద్ద సమర్పించిన వివరాల్లో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆరేళ్లుగా అధ్యక్షుడిగా ఉన్న పుతిన్‌ ఒక మిలియన్ డాలర్ల కంటే తక్కువ సంపాదించారని వాటి సారాంశం. ఈ క్రమంలో టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌(Elon Musk).. ఓ సందర్భంలో ఆయన గురించి చెప్పిన ఓ విషయం వైరల్‌గా మారింది.

ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా నిలవడం గురించి ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా.. ‘పుతిన్‌ నాకంటే ధనవంతుడు అని నేను భావిస్తున్నాను’ అని మస్క్‌ నుంచి సమాధానం వచ్చింది. ఇది 2022లో జరిగిన సంభాషణ. అది అలాఉంటే.. ఇప్పటికీ రష్యా అధ్యక్షుడి ఆస్తి వివరాలపై స్పష్టమైన లెక్కలు లేవు. ఆ సంపద ఒక మిస్టరీగానే ఉంది. నల్ల సముద్రం సమీపంలో ఆయనకు 1.4 బిలియన్‌ డాలర్ల విలువైన ప్యాలెస్ ఉందని, మొనాకోలో 4 బిలియన్ల విలువైన అపార్ట్‌మెంట్ ఉందని పలు కథనాలు వెల్లడించాయి.

అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకోబోమని జిన్‌పింగ్‌ హామీ..!

మొత్తంగా 20 భవంతులు, 700 కార్లు, 58 విమానాలు, హెలికాప్టర్లు ఆయన సొంతమని తెలుస్తోంది. వాటిలో ‘ది ఫ్లయింగ్‌ క్రెమ్లిన్’ పేరిట 716 మిలియన్ల డాలర్ల విలువైన విమానం కూడా ఉంది. వీటితో కలిపి ఆయన నికర సంపద 200 బిలియన్ల డాలర్ల వరకు ఉంటుందని ఆ నివేదికలు పేర్కొన్నాయి. కానీ ఆ లెక్కలకు మించి ఆయన ఆస్తిపాస్తులు ఉండొచ్చని తెలుస్తోంది.  మాస్కో శివారులో ఉన్న విలాస భవనం.. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌కు రెండింతలు ఉంటుంది. మరోవైపు ఫోర్బ్స్‌ గణాంకాల ప్రకారం.. ఆరు సంస్థలను నిర్వహిస్తోన్న మస్క్‌ సంపద విలువ 204 బిలియన్ల డాలర్లు కావడం గమనార్హం.

ఫైనాన్సియర్‌ బిల్‌ బ్రౌడర్‌.. 2017లో అమెరికా సెనేట్‌ జ్యుడీషియరీ కమిటీ ముందు హాజరైనప్పుడు ఈ 200 బిలియన్ల డాలర్ల ప్రస్తావన తెచ్చారు. గతంలో పనామా లీక్స్‌ ఆయన రహస్య ఒప్పందాల గురించి బయటపెట్టాయి. కానీ తన సంపద వార్తలపై పుతిన్ సూటిగా స్పందించకుండా.. తనదైన శైలిలో విమర్శకులకు సమాధానం చెప్పారు. ‘ఈ ప్రపంచంలోనే నేను అత్యంత సంపన్నుడిని. రష్యా వంటి గొప్ప దేశాన్ని పాలించే అవకాశాన్ని ప్రజలు అప్పగించి, నన్ను ధనవంతుడిని చేశారు. అదే నా సంపద’ అంటూ బదులిచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని