Vladimir Putin: నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్‌-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్‌

నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్‌ కొట్టిపారేశారు. 

Updated : 28 Mar 2024 22:32 IST

మాస్కో: నాటో (NATO) దేశాలపై రష్యా (Russia) దాడి చేస్తుందనే వాదనను ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) ఖండించారు. కానీ, ఉక్రెయిన్‌ (Ukraine)కు పశ్చిమ దేశాలు ఎఫ్‌-16 యుద్ధ విమానాలను (F-16 Fighter Jets) అందజేస్తే మాత్రం వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. బుధవారం టోర్జోక్‌ ప్రాంతంలో ఉన్న రష్యా వైమానిక స్థావరాన్ని ఆయన సందర్శించారు. అక్కడి పైలట్లతో ముచ్చటించిన ఆయన కొద్దిసేపు సైనిక హెలీకాఫ్టర్‌లోని సిమ్యులేటర్‌లో కూర్చుని దాన్ని పరిశీలించారు. 

‘‘1991లో సోవియట్‌ యూనియన్‌ విచ్ఛినమైన తర్వాత అమెరికా నాయకత్వంలోని సైనిక కూటమి రష్యా వైపుగా విస్తరించింది. కానీ, నాటో దేశాలపై దూకుడుగా వ్యవహరించాలనే ఆలోచన మాకు లేదు. పోలండ్‌, చెక్‌ రిపబ్లిక్‌లపై రష్యా దాడి చేస్తుందని పశ్చిమ దేశాలు పిచ్చి వాదన చేస్తున్నాయి. వాషింగ్టన్‌తో మాస్కో సంబంధాలు ఇంతవరకూ దిగజారలేదు. ఒకవేళ ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపినా, ఎఫ్‌-16లను ఇచ్చినా వాటిని కూల్చివేయడం ఖాయం. పొరుగు దేశాల నుంచి రష్యాను లక్ష్యంగా చేసుకున్నా.. అమెరికా కోసం ఆ దేశాలు మూల్యం చెల్లించుకోవాల్సిందే’’ అని పుతిన్‌ వెల్లడించారు. 

భారత్‌ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్‌ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!

దాదాపు రెండేళ్ల నుంచి రష్యాతో ఉక్రెయిన్‌ యుద్ధం చేస్తోంది. మాస్కోతో పోరాటంలో ఎఫ్‌-16ల అవసరం ఉందని కీవ్ చెబుతోంది. పొరుగున ఉన్న బెల్జియం, డెన్మార్క్‌, నార్వే, నెదర్లాండ్స్‌ దేశాలు వాటిని తమకు అందజేయాలని కోరింది. ఎఫ్‌-16లను ఉక్రెయిన్‌కు ఇచ్చేందుకు అమెరికా అంగీకరించడంతో నెదర్లాండ్స్‌, డెన్మార్క్‌లు ముందుకొచ్చాయి. త్వరలో ఉక్రెయిన్‌ పైలట్లు శిక్షణ తీసుకోనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా తెలిపారు. ఈ నేపథ్యంలోనే పుతిన్ వ్యాఖ్యలు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని