Russia-Ukraine: కీవ్‌పై రాకెట్లతో విరుచుకుపడిన రష్యా.. మాస్కోపై పోలండ్‌ ఆగ్రహం

మాస్కోపై ఉగ్రదాడితో ఉక్రెయిన్‌కు సంబంధం ఉందని ఆరోపించిన రష్యా.. ఆదివారం కీవ్‌పై వరుస రాకెట్లతో విరుచుకుపడింది.

Published : 24 Mar 2024 18:20 IST

కీవ్‌: ఉక్రెయిన్‌ (Ukriane) రాజధాని కీవ్‌ (Kyiv) నగరంపై ఆదివారం రష్యా (Russia) రాకెట్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఒక రాకెట్‌ నిబంధనలకు విరుద్ధంగా తమ ఎయిర్‌స్పేస్‌లోకి ప్రవేశించిందని పోలండ్‌ (Poland) ఆగ్రహం వ్యక్తం చేసింది. కీవ్‌ లక్ష్యంగా రష్యా రాకెట్ల దాడి చేయడం నాలుగు రోజుల వ్యవధిలో ఇది మూడోసారి. దీనిపై ఉక్రెయిన్‌ ప్రకటన విడుదల చేసింది.

‘‘ఆదివారం కీవ్‌పై రష్యా వరుసగా టీయూ-95ఎమ్‌ఎస్‌ క్రూయిజ్ మిసైల్స్‌ను ప్రయోగించింది. రెండు గంటలపాటు ఉక్రెయిన్‌ ఉపరితల భద్రతా వ్యవస్థ సైరన్‌ మోగుతూనే ఉంది. సరతోవ్‌ ప్రాంతం నుంచి 29 క్రూయిజ్‌ మిసైల్స్‌, 28 డ్రోన్లతో దాడి చేసింది. వీటిలో 18 మిసైల్స్‌, 25 డ్రోన్లలను ఉక్రెయిన్‌ సైన్యం కూల్చివేసింది’’ అని కీవ్‌ సైనిక అధికారి సెర్హి పాప్‌కో తెలిపారు. మరోవైపు నాటో సభ్య దేశమైన పోలండ్‌ ఈ దాడిపై మండిపడింది. అంతర్జాతీయ నిబంధనలను రష్యా తరచూ ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన నాటి నుంచి పోలండ్‌ కీవ్‌కు మద్దతుగా నిలుస్తోంది.

మెసేజింగ్‌ యాప్‌ నుంచే మాస్కోదాడి కుట్ర అమలు.. నిందితుల ఇంటరాగేషన్‌లో వెల్లడి..!

మాస్కో సంగీత కచేరీ దాడి ఘటనలో ఉక్రెయిన్‌కు సంబంధముందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సహా భద్రతా సంస్థలు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఆరోపణలను ఉక్రెయిన్‌ ఖండించింది. ఈ దాడిలో 133 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్ర సంస్థ దాడులకు బాధ్యత వహిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటన చేసింది. దీనిపై జాతినుద్దేశించి ప్రసంగించిన పుతిన్‌.. ఆటవిక ఉగ్ర దాడిగా అభివర్ణించారు. ఆదివారాన్ని జాతీయ సంతాప దినంగా ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని