Putin: రష్యా నుంచి కాలు బయటపెట్టనున్న పుతిన్‌.. అరెస్టు వారెంట్ తర్వాత తొలిసారి..!

Putin China Visit: ఈ ఏడాది చివర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చైనాలో పర్యటించనున్నట్లు సమాచారం. ఐసీసీ అరెస్టు వారెంట్‌ జారీ చేసిన తర్వాత ఆయన చేయనున్న తొలి విదేశీ పర్యటన ఇదే.

Updated : 30 Aug 2023 10:57 IST

మాస్కో: రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin)ఎట్టకేలకు విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది అక్టోబరులో ఆయన చైనా (China)లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. బీజింగ్‌లో జరిగే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ సదస్సుకు ఆయన హాజరుకానున్నట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కాగా.. ఉక్రెయిన్‌ (Ukraine)లో యుద్ధ నేరాలకు గానూ పుతిన్‌పై ఐసీసీ అరెస్టు వారెంట్‌ (ICC Arrest Warrant) జారీ చేసిన తర్వాత ఆయన చేయనున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం.

ఈ ఏడాది అక్టోబరులో జరిగే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ సదస్సుకు హాజరుకావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi Jinping).. పుతిన్‌ను ఆహ్వానించారు. ఇందుకు రష్యా అధ్యక్షుడు అంగీకరించినట్లు సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇప్పటికే పుతిన్‌ చైనా పర్యటన (Putin China Visit) కోసం క్రెమ్లిన్‌ షెడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

గత ఏడాదికి పైగా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను సాగిస్తున్న నేపథ్యంలో పుతిన్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. ఉక్రెయిన్‌లోని పిల్లలను రష్యా అపహరించుకు పోయిందన్న ఆరోపణలపై ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ICC) పుతిన్‌పై అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. అంటే.. ఐసీసీలో సభ్యత్వం ఉన్న దేశాల్లో ఆయన కన్పిస్తే అరెస్టు చేయాల్సి ఉంటుంది. దీంతో అప్పటి నుంచి ఆయన రష్యా అంతర్జాతీయ సరిహద్దులు దాటలేదు. అరెస్టు ముప్పు నేపథ్యంలో ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్‌ సదస్సుకు ఆయన హాజరుకాలేదు.

రష్యా ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్ల దాడి.. దెబ్బతిన్న నాలుగు విమానాలు

ఇక, సెప్టెంబరులో భారత్‌ అధ్యక్షతన దిల్లీలో జరిగే జి-20 దేశాధినేతల సమావేశానికి హాజరుకాబోనని ఇప్పటికే వెల్లడించారు. ఐసీసీ నిబంధనలను భారత్‌ అమలు చేయాల్సిన అవసరం లేనప్పటికీ.. పుతిన్‌ ఆ సదస్సుకు వచ్చేందుకు విముఖత చూపించారు. అలాంటిది.. ఇప్పుడు అక్టోబరులో చైనా వెళ్లేందుకు సిద్ధమవడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఉక్రెయిన్‌లో సైనిక చర్య నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించిన వేళ.. బీజింగ్‌తో పుతిన్‌ బంధం మరింత బలపడుతోంది. ఈ క్రమంలోనే చైనాకు మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జిన్‌పింగ్‌.. మార్చిలో మాస్కోలో పర్యటించారు. ఇందులో భాగంగా పుతిన్‌తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే.

ఇక, 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించిన నాటి నుంచి పుతిన్‌.. అరుదుగా ఇతర దేశాల్లో పర్యటిస్తున్నారు. మాజీ సొవియెట్‌ యూనియన్ దేశాలు, ఇరాన్‌ మినహా ఇప్పటివరకు మరే దేశానికి ఆయన వెళ్లలేదు. ఇక, కీవ్‌పై యుద్ధానికి కొద్ది రోజుల ముందు గతేడాది ఫిబ్రవరిలో పుతిన్‌ చైనాలో పర్యటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు