కుప్పకూలిన రష్యా సైనిక విమానం.. ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీలు సహా 74 మంది మృతి

ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలతో వెళ్తున్న రష్యా(Russia) మిలిటరీ విమానం కుప్పకూలింది.

Updated : 24 Jan 2024 16:54 IST

(ప్రతీకాత్మక చిత్రం)

మాస్కో: ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా (Russia) విమానం కుప్పకూలింది. అందులో ప్రయాణిస్తున్న మొత్తం 74 మంది దుర్మరణం చెందారు. ఈ సైనిక రవాణా విమానం(IL-76)లో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారని రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్‌ సమీపంలోని బెల్గోరాడ్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనికి గల కారణాలను గుర్తించేందుకు స్పెషల్ మిలిటరీ కమిషన్ ఘటనా స్థలానికి బయలుదేరింది.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ప్రమాదానికి ముందు విమానం అదుపుతప్పి వేగంగా కిందికి పడిపోతున్నట్లు కనిపిస్తోంది. తర్వాత ఇది నివాసప్రాంతాల వద్ద నేలను తాకింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఖైదీల మార్పిడిలో భాగంగా ఉక్రెయిన్ ఖైదీలను బెల్గోరాడ్ ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రష్యా అధికారులు తెలిపారు.

ఆ విమానాన్ని తమ రక్షణబలగాలు కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌లోని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. అందులో రష్యా క్షిపణులను తరలిస్తోందని, యుద్ధ ఖైదీలను కాదని పేర్కొన్నాయి. కానీ రష్యా మాత్రం అందులో ఉన్నది యుద్ధ ఖైదీలేనని చెప్తోంది. దీనిపై రష్యా పార్లమెంట్ స్పీకర్ మాట్లాడుతూ.. ‘సొంత సైనికులు వెళ్తున్న విమానాన్ని వారు కూల్చివేశారు. మానవతా మిషన్‌లో భాగమైన మా పైలట్లు దానిలో ఉన్నారు’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక ఈ సైనిక రవాణా విమానం(IL-76)లో బలగాలు, సరకులు, సైనిక సాధనాలను తరలించే వీలుంది. ఈతరహా విమానాలు భారత వైమానిక దళంలో కూడా సేవలు అందిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని