Crimea: ఉక్రెయిన్‌ దూకుడు.. క్షిపణి దాడిలో రష్యా నౌక ధ్వంసం..!

క్రిమియాలో రష్యాకు చెందిన ఓ సైనిక నౌకపై దాడి చేసి, ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది.

Published : 26 Dec 2023 18:46 IST

మాస్కో: నల్ల సముద్రం (Black Sea)లో రష్యాకు మరో ఎదురుదెబ్బ! ఓ భారీ సైనిక రవాణా నౌకను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్‌ తన యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఈ దాడిలో నౌక ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ వైమానిక దళ కమాండర్‌ ప్రకటించారు. రష్యా నౌకాదళ సామర్థ్యం మరింత క్షీణించిందని వ్యాఖ్యానించారు. మరోవైపు.. ఈ దాడిని రష్యా రక్షణశాఖ ధ్రువీకరించింది. అయితే, నౌక కేవలం దెబ్బతిన్నట్లు తెలిపింది. రష్యా ఆక్రమిత క్రిమియా (Crimea)లోని ఫియోదోసియా నౌకాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

‘‘ఉక్రెయిన్‌ తన వైమానిక దాడిలో భాగంగా గైడెడ్‌ క్షిపణులు ప్రయోగించింది. దీంతో రష్యా ల్యాండింగ్‌ నౌక ‘నోవోచెర్‌కాస్క్‌’ దెబ్బతింది. అయితే.. దాడి సమయంలో రెండు ఉక్రెయిన్ యుద్ధ విమానాలను మా ‘యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ వ్యవస్థ’ ధ్వంసం చేసింది’’ అని రష్యా తెలిపింది. ఒకరు మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మరోవైపు.. నౌక ప్రస్తుత పరిస్థితి గురించి తెలియాల్సి ఉంది. అయితే.. ఘటనాస్థలంలో పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతోన్న దృశ్యాలు ఉక్రెయిన్‌ మీడియాలో ప్రసారమయ్యాయి.

ఉక్రెయిన్‌పై ‘సూపర్‌ వెపన్‌’ వాడిన రష్యా..: బ్రిటన్‌

‘నోవోచెర్‌కాస్క్‌’పై దాడి జరగడం ఇది రెండోసారి. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలైన రెండో నెలలో (2022 మార్చి)నూ ఒకసారి ఇది దెబ్బతింది. సైనికులు, ఆయుధాల రవాణాకు పుతిన్‌ సేనలు ఈ నౌకను వినియోగిస్తున్నట్లు ఉక్రెయిన్‌ పేర్కొంది. క్రిమియాపై కొన్ని నెలలుగా కీవ్‌ వరుస దాడులు చేపడుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సముద్ర డ్రోన్లతో విరుచుకుపడుతోంది. మరోవైపు.. సోమవారం రాత్రి రష్యా 19 డ్రోన్లను ప్రయోగించిందని, వాటిలో 13 డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ సైన్యం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని