Russia: ఉక్రెయిన్‌పై ‘సూపర్‌ వెపన్‌’ వాడిన రష్యా..: బ్రిటన్‌

రష్యా తన సూపర్‌ ఆయుధాన్ని మరోసారి ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. ఈ విషయాన్ని బ్రిటన్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు పసిగట్టాయి. 

Published : 26 Dec 2023 14:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా (Russia) ఓ అత్యాధునిక ఆయుధాన్ని ప్రయోగించినట్టు యూకే రక్షణశాఖ నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆ సంస్థ ఇటీవల ఎక్స్‌ (ట్విటర్‌)లో పబ్లిష్‌ చేసిన నివేదికలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. డిసెంబర్‌ 14వ తేదీన రష్యా వాయుసేన తొలిసారి AS-24 కిల్‌జాయ్‌ (KILLJOY) అనే బాలిస్టిక్‌ మిసైల్‌ను ప్రయోగించింది. ఆగస్టు తర్వాత ఈ ఆయుధాన్ని వాడటం ఇదే తొలిసారి. సెంట్రల్‌ ఉక్రెయిన్‌లోని వైమానిక స్థావరం లక్ష్యంగా దీనిని ప్రయోగించినట్లు చెబుతోంది. 

మానవ మెదడును అనుకరించొచ్చు!

ఈ శీతాకాలంలో రష్యా దళాలు భూతల ఆపరేషన్లను నిలిపివేసి కేవలం క్షిపణి దాడులనే చేపట్టేందుకు ప్లాన్‌ చేస్తున్నాయని నాటో సెక్రటరీ జనరల్‌ జేన్స్‌ స్టాలెన్‌బర్గ్‌ ఇటీవల ప్రకటించారు. ఉక్రెయిన్‌లోని ప్రధాన మౌలిక వసతులే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతాయని చెప్పడం గమనార్హం. 

మెరుపు వేగం కిల్‌జాయ్ సొంతం..

రష్యా ఆయుధగారంలోని అత్యంత అధునాతన క్షిపణుల్లో AS-24 కిల్‌జాయ్‌ (KILLJOY) క్షిపణి ఒకటి.  అణు వార్‌హెడ్‌ను మోసుకెళ్లగల ఈ క్షిపణి.. 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ పేర్కొంది. కనీసం గంటకు 3,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అత్యధికంగా గంటకు 7,673 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. విమానాల నుంచి కూడా  దీనిని ప్రయోగించవచ్చు. 

2018లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆవిష్కరించిన ఆరు సూపర్‌ ఆయుధాల్లో కిల్‌జాయ్‌ కూడా ఒకటి.ఈ ఆయుధం రష్యా భవిష్యత్తు వ్యూహాల్లో కీలక పాత్ర పోషించనుందని అప్పట్లో పుతిన్‌ వెల్లడించారు. శత్రుదేశాలకు చెందిన ఉన్నతశ్రేణి లక్ష్యాలను ఛేదించేందుకు దీనిని ప్రయోగిస్తామని ఆయన వెల్లడించారు. గతేడాది మార్చిలో తొలిసారి ఓ ఆయుధ డంప్‌ను ధ్వంసం చేయడానికి రష్యా దీనిని ప్రయోగించింది. ఈ క్షిపణులను సిరియాలో కూడా మోహరించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు