Russia: మేం ఎలా జీవించాలో చెప్పే హక్కు అమెరికాకు లేదు! రష్యా

ప్రపంచవ్యాప్తంగా మిత్రదేశాలకు ఆయుధాలు సరఫరా చేస్తూ గందరగోళాన్ని సృష్టించే అమెరికాకు.. ఉత్తర కొరియాతో సంబంధాలపై తమకు ఉపన్యాసాలు ఇచ్చే హక్కు లేదని రష్యా పేర్కొంది.

Published : 14 Sep 2023 18:37 IST

మాస్కో: రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో (Vladimir Putin) సమావేశమైన ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un).. కీలక విషయాలపై చర్చించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అమెరికాతోపాటు దక్షిణ కొరియా వంటి దేశాల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమయ్యింది. ఈ నేపథ్యంలో స్పందించిన రష్యా.. అమెరికాపై నిప్పులు చెరిగింది. ప్రపంచవ్యాప్తంగా మిత్రదేశాలకు ఆయుధాలు సరఫరా చేస్తూ గందరగోళాన్ని సృష్టించే మీరు (America).. ఉత్తర కొరియాతో సంబంధాలపై తమకు నీతులు చెప్పొద్దని ఘాటుగా స్పందించింది.

‘తాము ఎలా జీవించాలో ఉపన్యాసమిచ్చే హక్కు అమెరికాకు లేదు’ అని అమెరికాలోని రష్యా రాయబారి అనాటోలి ఆంటోనొవ్‌ పేర్కొన్నారు. వేల కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందించడంతోపాటు ఆసియాలో పలు దేశాలతో బంధాన్ని ఏర్పరచుకోవడం, ఉత్తర కొరియా సమీపంలో సైనిక కసరత్తు అమెరికా చేసిందన్నారు. ఆర్థిక ఆంక్షలను చెత్తబుట్టలో పడేయాల్సిన సమయం వచ్చిందన్న ఆంటోనొవ్‌.. ఏకధ్రువ ఆధిపత్యాన్ని చెలాయించడం అమెరికా అధికారులకు ఇక సాధ్యం కాదని స్పష్టం చేశారు.

75% ఉద్యోగులను తొలగిస్తా.. FBIని మూసేస్తా! వివేక్‌ రామస్వామి

రష్యా పర్యటన సందర్భంగా దాదాపు ఐదు గంటలపాటు పుతిన్‌తో భేటీ అయిన కిమ్‌.. సైనిక సహకారం, ఆయుధాల సరఫరా వంటి విషయాలపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఇదే సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు కిమ్‌ పేర్కొన్నారు. ఇదే సమయంలో రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలను అందించనుందనే వార్తలు అమెరికాకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఆయుధాలు సరఫరా అయ్యాయా..? అనే విషయంపై స్పష్టత లేనప్పటికీ.. అమెరికా, దక్షిణ కొరియాతోపాటు పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని