Ukraine: ఈ నెలలో రష్యాకు రెండోషాక్‌.. మరో భారీ నౌకను ధ్వంసం చేసిన ఉక్రెయిన్‌ సముద్ర డ్రోన్‌..!

ఉక్రెయిన్‌ స్పెషల్‌ ఫోర్స్‌లోని యూనిట్‌-13 రష్యాకు నిద్రపట్టనీయడంలేదు. ఈ నెలలో రెండోసారి మాస్కోకు చెందిన భారీ నౌకను నల్లసముద్రంలో ముంచేసింది.   

Updated : 15 Feb 2024 11:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా(Russia)కు చెందిన భారీ ల్యాండింగ్‌ నౌక ‘సీజర్‌ కునికోవ్‌’ను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ (Ukraine) ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌ బుధవారం ప్రకటించింది. ఈ దాడి క్రిమియా జలాల్లో జరిగినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేసింది. ఈ నౌకపై మాగురా-వీ5 శ్రేణి సముద్ర డ్రోన్లతో స్పెషల్‌ ఫోర్స్‌లోని యూనిట్‌-13 దాడి చేసినట్లు తెలిపింది. దీంతో ఆ నౌక మునిగిపోవడం మొదలుపెట్టింది. ఇక్కడ రష్యా దళాలు సహాయ కార్యక్రమాల కోసం హెలికాప్టర్లను కూడా ఉపయోగించినట్లు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదు. మాస్కో మాత్రం ఈ ఘటనపై మౌనం వహిస్తోంది.

దీనిపై ప్రశ్నకు క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని రక్షణ శాఖలోని వారిని అడగాలన్నారు. సీజర్‌ కునికోవ్‌ను రష్యా ప్రాజెక్ట్‌ 775 కింద తయారు చేసింది. ఇది 87 మంది సిబ్బందిని తీసుకెళ్లగలదు. సిరియా, జార్జియా, ఉక్రెయిన్‌ యుద్ధాల్లో ఇది కీలక పాత్ర పోషించింది. 

ట్రంప్‌ కంటే బైడెన్‌ బెటర్‌.. ఎందుకో చెప్పిన పుతిన్‌!

ఇటీవల కాలంలో రష్యాకు చెందిన చాలా ముఖ్య నౌకలు నల్ల సముద్రంలో ఉక్రెయిన్‌ దెబ్బకు మునిగిపోయాయి. ఒక దశలో రష్యా నల్లసముద్ర దళంలోని నౌకలను నోవోరోస్యాక్‌ పోర్టు తరలించాల్సి వచ్చింది. ఫిబ్రవరి నెలలోనే ఉక్రెయిన్‌ రెండు నౌకలను ముంచినట్లైంది. 1వ తేదీన జరిపిన దాడిలో ఒక మిసైల్‌ బోటును ధ్వంసం చేసింది. అప్పుడు కూడా మాగురా వీ5 వినియోగించింది. గతంలో జెట్‌స్కీలుగా వాడిన వాటితో ఉక్రెయిన్‌ ఈ సముద్ర డ్రోన్లను అభివృద్ధి చేసింది. వీటిని రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో విడిగా.. లేదా గుంపుగా కూడా వినియోగించవచ్చు. 

నాటో కూటమి రక్షణ మంత్రుల సమావేశానికి ముందు సెక్రటరీ జనరల్‌ జేన్స్‌ స్టోలెన్‌బెర్గ్‌ మాట్లాడుతూ.. రష్యా నల్లసముద్ర దళం భారీగా దెబ్బతినడంతో ఉక్రెయిన్‌ ధాన్యం ఎగుమతుల కారిడార్‌ సాధ్యమైందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని