Putin: ట్రంప్‌ కంటే బైడెన్‌ బెటర్‌.. ఎందుకో చెప్పిన పుతిన్‌!

Putin: రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా తాము కలిసి పనిచేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. కానీ, ట్రంప్‌తో పోలిస్తే బైడెన్‌ మేలని అభిప్రాయపడ్డారు.

Updated : 15 Feb 2024 08:42 IST

మాస్కో: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ (Joe Biden) రెండోసారి గెలుపొందాలని రష్యా ఆకాంక్షించింది. రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌తో పోలిస్తే ఆయన మేలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) అన్నారు. ఎవరు గెలిచినా వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని బుధవారం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ, మాస్కో కోణంలో చూస్తే మాత్రం బైడెన్‌ గెలవాలని తాను కోరుకుంటానన్నారు.

బైడెన్‌ అనుభవం, అంచనావేయగల నేత అని పుతిన్‌ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలపై స్పందిస్తూ.. తాను వైద్యుణ్ని కాదని, ఆ విషయాలపై వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. అమెరికా ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ ఇలాంటి విమర్శలు తీవ్రరూపం దాలుస్తున్నాయన్నారు. ‘‘2021లో నేను బైడెన్‌ను స్విట్జర్లాండ్‌లో కలిసినప్పుడు కూడా ఆయన ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, అప్పటికి ఆయన సాధారణంగానే ఉన్నారు. అయితే, పేపర్‌లో చూస్తూ మాట్లాడతారు. తానూ చాలా సందర్భాల్లో అలా చేస్తాను. అది పెద్ద విషయమేమీ కాదు’’ అని పుతిన్‌ అన్నారు. బైడెన్‌కు వయసు మీదపడటంతో జ్ఞాపకశక్తి సన్నగిల్లిందనే విమర్శలు ఇటీవల ఎక్కువైన విషయం తెలిసిందే.

బైడెన్‌ విధానాలు చాలా బలంగా ఉంటాయని పుతిన్‌ (Vladimir Putin) అన్నారు. కొన్ని విషయాల్లో వారి వైఖరుల్లో చాలా తప్పులు, లోపాలున్నాయని చెప్పారు. ఆ విషయాన్ని తాను స్వయంగా ఆయనకు తెలియజేశానని తెలిపారు. ఉక్రెయిన్‌లోని రష్యన్లను కాపాడడానికి, దేశ రక్షణకు నాటో నుంచి ఉన్న ముప్పును తిప్పికొట్టడానికే సైనిక చర్యను ప్రారంభించామని పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ విధానానికి నాటో ఒక ఆయుధం లాంటిదని వ్యాఖ్యానించారు.

నాటో దేశాలు తమ రక్షణ బడ్జెట్‌ను పెంచకపోతే తానే రష్యాను ఉసిగొల్పుతానంటూ ఇటీవల ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపైనా పుతిన్‌ స్పందించారు. మిత్రదేశాలతో సంబంధాలను పెంపొందించుకోవడానికి అది ఆయన విధానమై ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆయన కోణంలో అది సరైనదే అయి ఉండొచ్చన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని