Serial Killer: ఒంటరి మహిళలే టార్గెట్‌.. 31 మందిని హతమార్చిన వ్యక్తికి జీవిత ఖైదు

ఏకంగా 31 మంది మహిళలను హతమార్చిన ఓ సీరియల్‌ కిల్లర్‌కు రష్యా కోర్టు జీవిత ఖైదు విధించింది.

Published : 21 Mar 2024 22:10 IST

మాస్కో: వృద్ధ మహిళలనే లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలకు పాల్పడ్డాడో సీరియల్‌ కిల్లర్‌. ఏకంగా 31 మందిని చంపేశాడు. స్థానికంగా వోల్గా ఉన్మాది (Volga Maniac)గా ముద్రపడిన అతడికి రష్యా కోర్టు తాజాగా జీవిత ఖైదు విధించింది. అధికారుల వివరాల ప్రకారం.. రష్యాలోని తతార్‌స్థాన్‌ రీజియన్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో 2011-12 మధ్యకాలంలో వరుస హత్యలు వెలుగుచూశాయి. అవన్నీ ఒకే రీతిలో సాగడంతో.. వీటి వెనుక సీరియల్‌ కిల్లర్‌ ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. నిందితుడిని పట్టుకునేందుకు ఏళ్లపాటు వేట కొనసాగించారు. అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ.27 లక్షల రివార్డూ ప్రకటించారు. డీఎన్‌ఏ ఆనవాళ్లు, బూటు ముద్రల ఆధారంగా అతడిని రాదిక్‌ టాగిరోవ్‌గా గుర్తించి.. 2020 డిసెంబరులో అరెస్టు చేశారు.

డీప్‌ఫేక్‌తో ఇటలీ ప్రధానిపై అసభ్య వీడియోలు.. రూ.90 లక్షల పరువు నష్టం దావా

తాళాల రిపేర్‌ పనులు చేసే టాగిరోవ్‌.. గతంలో చిన్న చిన్న చోరీలకు పాల్పడేవాడు. జైలుశిక్ష కూడా అనుభవించాడు. ఈ క్రమంలోనే ఒంటరి వృద్ధ మహిళలనే టార్గెట్‌గా చేసుకుని.. సామాజిక కార్యకర్త, ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌ ఇలా రకరకాల అవతారాలెత్తి, వారి ఇళ్లలోకి ప్రవేశించేవాడు. గొంతునులిమి హతమార్చి.. నగదు, విలువైన వస్తువులతో ఉడాయించేవాడు. మృతులంతా 75 నుంచి 90 ఏళ్లలోపువారే. 2011- 12 మధ్యకాలంలో తతార్‌స్థాన్‌, చుట్టుపక్కల 15 నగరాల్లో ఈ దారుణాలకు ఒడిగట్టాడు. 2022 అక్టోబరులో కజాన్‌ కోర్టులో విచారణ ప్రారంభమైంది. దోషిగా తేలడంతో తాజాగా శిక్ష ఖరారైంది. అనేక హత్యాయత్నాలతోపాటు మరో 34 మంది మహిళలపై దాడులకు పాల్పడినట్లు కూడా న్యాయస్థానం నిర్ధరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని