Deepfake: డీప్‌ఫేక్‌తో ఇటలీ ప్రధానిపై అసభ్య వీడియోలు.. రూ.90 లక్షల పరువు నష్టం దావా

Deepfake: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సైతం డీప్‌ఫేక్‌ బాధితురాలిగా మారారు. దీంతో ఆమె న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. 

Updated : 21 Mar 2024 19:00 IST

Deepfake | దిల్లీ: డీప్‌ఫేక్‌ వీడియోల బాధితులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. సామాన్యుల దగ్గర నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు, దేశాధినేతల వరకు దీని బారిన పడుతున్నారు. తాజాగా ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనికి (Giorgia Meloni) సైతం దీని ముప్పు తప్పలేదు. వీటిపై పోరాడేందుకు ఆమె ముందుకొచ్చారు. నిందితులపై పరువు నష్టం దావా వేసి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.

డీప్‌ఫేక్‌ (Deepfake) టెక్నాలజీ సాయంతో ఓ అసభ్య వీడియోను మెలోని ముఖంతో మార్ఫ్‌ చేశారు. ఇది ఆమె దృష్టికి రావటంతో దాదాపు రూ.90 లక్షల పరువు నష్టం దావా వేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వీడియోను 2022లో అమెరికా నుంచి ఓ అశ్లీల సైట్‌లోకి అప్‌లోడ్‌ చేసినట్లు గుర్తించారు. అప్పటికీ ఆమె ప్రధానిగా బాధ్యతలు స్వీకరించలేదు. వీడియో అప్‌లోడ్‌ చేయడానికి ఉపయోగించిన స్మార్ట్‌ఫోన్‌ను ట్రాక్‌ చేసి నిందితులను గుర్తించారు. 40 ఏళ్ల వ్యక్తితో పాటు, 73 ఏళ్ల అతడి తండ్రి ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు తేల్చారు.

డీప్‌ఫేక్‌..మాయలో పడొద్దు!

పరువు నష్టం కింద కోరిన మొత్తాన్ని హింసకు గురవుతున్న బాధిత మహిళల సంక్షేమం కోసం విరాళంగా ఇస్తామని మెలోని తరఫున న్యాయవాది వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం మెలోని స్వయంగా జులైలో కోర్టుకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇలాంటి దావాలను ఇటలీలో తీవ్ర నేరాలుగా పరిగణిస్తారు. జరిమానాతో పాటు ఏడేళ్ల వరకు జైలు శిక్ష సైతం పడే అవకాశం ఉంది.

అసలేమిటీ డీప్‌ఫేక్‌?

ఒకప్పుడు ఫొటోలను మార్ఫింగ్‌ చేసి నకిలీవి తయారుచేసేవారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కృత్రిమమేధ సాయంతో అచ్చంగా ఒరిజినల్‌ అన్పించేలా నకిలీ వాటిని తయారు చేస్తున్నారు. దీనికి అవసరమైన టెక్నాలజీ, దాని ఫలితంగా వెలువడే బోగస్‌ కంటెంట్‌.. రెండూ స్ఫురించేలా దీన్ని ‘డీప్‌ఫేక్‌’ అంటున్నారు. దీంతో ఫొటోలు, వీడియోలు, ఆడియోలు.. నకిలీవి తయారుచేయొచ్చు. కొన్ని అసలు వాటిని మరిపిస్తే, మరికొన్ని కొత్త కంటెంట్‌ని సృష్టిస్తున్నాయి. ఫలితంగా ఒక వ్యక్తి లేనిచోట ఉన్నట్లు, చేయని పని చేసినట్లు, అనని మాటలు అన్నట్లు.. కంటెంట్‌ బయటకు వచ్చి, సదరు వ్యక్తికి తెలియకుండానే వ్యాపిస్తుంది. దాంతో ఆ సమాచారంలోని అంశానికి అతడు బాధ్యత వహించాల్సి వస్తుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని