Schengen Visa: యూరప్‌ ట్రిప్‌ మరింత భారం.. షెంజెన్‌ వీసా ఫీజు పెంపు

Schengen Visa: షెంజెన్‌ వీసా ఫీజును 12శాతం పెంచేందుకు యూరోపియన్‌ కమిషన్‌ ఆమోదం తెలిపింది. వచ్చే నెల నుంచే ఇది అమల్లోకి రానుంది.

Published : 21 May 2024 16:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐరోపా పర్యటనకు వెళ్లాలనుకునే వారికి ప్రయాణ ఖర్చుపై మరింత భారం పడనుంది. షెంజెన్‌ వీసా దరఖాస్తు ఫీజు (Schengen Visa Fee)ను 12 శాతం పెంచేందుకు యూరోపియన్‌ కమిషన్‌ (European Commission) ఆమోదించింది. జూన్‌ 11 నుంచి ఈ పెంపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని స్లొవేనియా విదేశీ, ఐరోపా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇప్పటివరకు పెద్దలకు షెంజెన్‌ వీసా దరఖాస్తు ధర 80 యూరోలు ఉండగా.. ఇప్పుడు దాన్ని 90 యూరోల (భారత కరెన్సీలో దాదాపు రూ.8వేలకు పైనే)కు పెంచారు. ఇక, 6-12 ఏళ్ల పిల్లల దరఖాస్తు ఫీజును 40 యూరోల నుంచి 45 యూరోలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ద్రవ్యోల్బణం, సివిల్‌ సర్వెంట్ల వేతనాలకు పెరిగిన ఖర్చులు తదితర కారణాలతో ఈ వీసా ఫీజు (EU visa fees)ను పెంచినట్లు యూరోపియన్‌ కమిషన్‌ తెలిపింది. చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో ఈ వీసా ధరలను పెంచారు.

బోర్గ్‌ డ్రింకింగ్‌.. అమెరికా యువతను మత్తెక్కిస్తున్న కొత్త ట్రెండ్‌!

షెంజెన్‌ అంటే.. 29 ఐరోపా (Europe) దేశాల సమాఖ్య. 90 రోజుల వరకు ఆయా దేశాల్లో పర్యటించేందుకు వీలుగా షెంజెన్‌ వీసా (Schengen visa)లను జారీ చేస్తుంటారు. ఏదైనా షెంజెన్‌ దేశం ఈ వీసాను జారీ చేస్తే.. దానిపై ఇతర షెంజెన్‌ దేశాల్లో పర్యటించేందుకు కూడా అనుమతి లభిస్తుంది. ఇటలీ, ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, క్రొయేషియా, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌ వంటి దేశాలు ఈ పరిధి కిందకు వస్తాయి. తాజా పెంపు నిర్ణయం భారతీయులపైనా అధిక ప్రభావమే చూపించనుంది. ఐరోపాకు వీసా దరఖాస్తుల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని