Space: అంతరిక్ష కేంద్రంలో ఎలుక పిండాల అభివృద్ధి!

అంతరిక్షంలో (Space) ఎలుక పిండాలు అభివృద్ధి చెందాయి. వాటిని నాలుగు రోజులపాటు అక్కడ పెంచారు.  

Updated : 29 Oct 2023 15:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతరిక్ష (Space) అన్వేషణలో భాగంగా శాస్త్రవేత్తలు మరో సరికొత్త విషయాన్ని కనుగొన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (International Space Station) ఎలుక పిండాలను అభివృద్ధి చేసి ఔరా అనిపించారు. అంతరిక్షంలో మానవుల పునరుత్పత్తి సాధ్యపడుతుందా అనే కోణంలో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టామని జపనీస్‌ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. 2021 ఆగస్టులో ఓ రాకెట్‌ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గడ్డకట్టిన స్థితిలో ఉన్న ఎలుక పిండాలను పంపించారు. జపాన్‌ ఏరోస్పేస్‌ ఏజెన్సీ(జేఏఎక్స్‌ఏ) బృందం, యమనాశి అడ్వాన్స్‌డ్‌ బయో టెక్నాలజీ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్‌ తెరుహికో వకయమా ఆ క్రతువులో పాలుపంచుకున్నారు. 

ప్రజలు చనిపోతున్నారు.. చర్చలు జరపండి: బెలారస్ అధ్యక్షుడు

అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు ప్రత్యేకంగా రూపొందించిన పరికరం సాయంతో ప్రారంభ దశలో ఉన్న పిండాలపై ఉన్న మంచును కరిగించి.. వాటిని నాలుగు రోజులపాటు అంతరిక్షంలో పెంచారు. ‘మైక్రోగ్రావిటీ పెరిగిన పరిస్థితుల్లోనూ పిండాలు అభివృద్ధి చెందాయి’ అని శాస్త్రవేత్తలు తెలిపారు. గురుత్వాకర్షణ శక్తి సంతానోత్పత్తిపై గణనీయమైన ప్రభావం చూపబోదని ఈ ప్రయోగం ద్వారా తెలుస్తోందనే అభిప్రాయాన్ని పరిశోధకులు వ్యక్తం చేశారు. వారు విశ్లేషించిన పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌ జర్నల్‌ ‘ఐసైన్స్‌’లో శనివారం ప్రచురించారు. 

అంతరిక్షంలో అభివృద్ధి చెందిన పిండాల డీఎన్‌ఏ, జన్యువుల పరిస్థితిలో ఎలాంటి గణనీయమైన మార్పులు చోటు చేసుకోలేదని పరిశోధకులు తమ పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. భూమిపై ఉన్న ప్రయోగశాలలో బ్లాస్టోసిస్ట్‌లను విశ్లేషించిన తరువాత ఈ విషయం నిర్ధారణ అయ్యిందని తెలిపారు. ‘క్షీరదాలు అంతరిక్షంలోనూ అభివృద్ధి చెందగలవని నిరూపించే మొట్టమొదటి అధ్యయనం ఇదేనని’ యమనాశి యూనివర్సిటీ, నేషనల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ రికెన్‌ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. అంతరిక్షంలో అభివృద్ధి చెందిన పిండాలను తిరిగి ఎలుకల్లో ప్రవేశపెడితే పుట్టుక సాధ్యమవుతుందా? లేదా అనే విషయాన్ని పరిశీలిస్తామని వెల్లడించాయి. భవిష్యత్తులో చేపట్టబోయే అంతరిక్ష అన్వేషణ యాత్రలకు, కాలనైజేషన్‌ మిషన్లకు ఈ పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని తెలిపాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని