USA: కిమ్‌ను అదుపు చేసేందుకు మరో అణు జలాంతర్గామి రాక..!

అమెరికా అణుశక్తి జలాంతర్గామి ఒకటి దక్షిణకొరియాలో లంగరేసింది. వారం రోజుల్లో ద.కొరియాలో ప్రవేశించిన రెండో అణు జలాంతర్గామి ఇది. అమెరికా సైనికుడి అప్పగింతపై చర్చలు జరుగుతున్న సమయంలో ఇది రావడం గమనార్హం.

Updated : 24 Jul 2023 14:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రోజుల వ్యవధిలోనే అమెరికా(USA)కు చెందిన రెండో అణుశక్తి జలాంతర్గామి దక్షిణ కొరియా(South Korea)లో లంగరేసింది. లాస్‌ ఏంజెల్స్‌ శ్రేణికి చెందిన యూఎస్‌ఎస్‌ అన్నాపోలిస్‌ జలాంతర్గామి జిజు ద్వీపంలో ఆగింది. ఉత్తరకొరియా క్రూయిజ్‌ క్షిపణి ప్రయోగాలు నిర్వహించిన కొన్ని గంటల్లోనే అమెరికా అణు జలాంతర్గామి ప్రత్యక్షం కావడం గమనార్హం. శ్రతువుల నౌకలు, జలాంతర్గాములను ధ్వంసం చేయడానికి అమెరికా ఈ సబ్‌మెరైన్‌ను వాడుతుంది. యూఎస్‌ఎస్‌ అన్నాపోలీస్‌లో ఓ న్యూక్లియర్‌ రియాక్టర్‌ కూడా ఉంది. తాజాగా జిజు ద్వీపం నుంచి ఈ సబ్‌మెరైన్‌కు అవసరమైన నిత్యావసరాలను సేకరిస్తోంది. కానీ, ఉత్తరకొరియా మాత్రం అమెరికా నౌకాదళం దక్షిణ కొరియాకు శిక్షణ ఇస్తోందని.. అందుకే ఈ జలాంతర్గామి వచ్చిందని అనుమానిస్తోంది.

వారం క్రితం అమెరికా అణు క్షిపణులను ప్రయోగించే సామర్థమున్న జలాంతర్గామి యూఎస్‌ఎస్‌ కెంటకీ.. బుసాన్‌ రేవుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామం ఇక్కడ ఉద్రిక్తతను మరింత పెంచింది. ఈ అంశమే తాము దక్షిణ కొరియాపై అణుదాడి చేయడానికి కారణం కావచ్చని ఉత్తరకొరియా రక్షణ మంత్రి హెచ్చరికలు జారీ చేశారు.

మద్యం తాగి కారు నడిపిన మహిళా మంత్రి గారు.. ఆపై రాజీనామా..!

1980ల తర్వాత ఒక ఎస్‌ఎస్‌బీఎన్‌ ఆ ప్రాంతానికి రావడం ఇదే తొలిసారి. ఓ అమెరికా సబ్‌ మెరైన్‌ దక్షిణ కొరియా జాలాల్లోకి గత వారం వచ్చింది. ఇది జరిగిన వారంలోపే మరో అణుశక్తి జలాంతర్గామి రావడం గమనార్హం.

అమెరికా సైనికుడి అప్పగింతపై చర్చలు మొదలు..

ఉత్తర కొరియాలోకి చొరబడి అక్కడి దళాలకు దొరికిపోయిన అమెరికా సైనికుడు ట్రావిస్‌ కింగ్‌ అప్పగింతపై చర్చలు మొదలయ్యాయి. యునైటెడ్‌ నేషన్స్‌ కమాండ్‌, ఉత్తరకొరియా ఈ చర్చలు చేపట్టాయి. ఈ విషయాన్ని అమెరికా నేతృత్వంలోని మల్టీనేషనల్‌ కమాండ్‌ వెల్లడించింది. కొరియా యుద్ధం సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా ఈ చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. తాము సైనికుడి భద్రతపై ఆందోళన చెందుతున్నట్లు అమెరికా పేర్కొంది. గత మంగళవారం నిస్సైనికీకరణ మండలాన్ని పౌరులు సందర్శిస్తున్న సమయంలో ఈ సైనికుడు హఠాత్తుగా ఉత్తరకొరియా వైపు పారిపోయాడు. అక్కడ అతడిని అదుపులోకి తీసుకొన్నారు. కానీ, ఉత్తరకొరియా వైపు నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు